పోలవరంపై వద్దు, ఏపీ, టీ మాత్రమే కాదు: వెంకయ్య
న్యూఢిల్లీ: పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు అని దాని పైన వివాదం సృష్టించవద్దని, దానిని పూర్తి చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం ఢిల్లీలో అన్నారు. బడ్జెట్ అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్‌లో జనాకర్షణ లేదని, అభివృద్ధి ఉందని చెప్పారు. దేశానికి సంపద పెంపు అవసరం ఉందన్నారు. జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్ భేషుగ్గా ఉందన్నారు. విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారని, సంపద పెరగకుండా కేటాయింపులు ఎలా సాధ్యమో విమర్శలు చేసేవారు చెప్పాలన్నారు.
బడ్జెట్ దేశం మొత్తానికి సంబంధించినదన్నారు. దేశం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాదని మిగిలిన 27 రాష్ట్రాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. వాటిని సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇరిగేషన్ అనేది సమస్య కాదని, రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న విధంగా కేటాయింపులు ఉంటాయన్నారు.
విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. ధరల పెంపుపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సంపదను సృష్టించడం చాలా కష్టమైన పని అని, అది ఉంటే దానిని పంచడం కష్టం కాదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. బడ్జెట్లో జనాకర్షణ కంటే దేశ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. సామాన్యులపై భారం పడకుండా పన్నుల వసూళ్లు సమర్థవంతంగా చేస్తామన్నారు.

సంపన్న వర్గాల పైన పన్నులు వేశామన్నారు. తన శాఖకు సంబంధించిన ప్రతి హామీ నెరవేర్చేందుకు వంద శాతం కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ చేసిన ప్రతి విమర్శకు సమాధానం చెప్పాలా? అన్నారు. ఉన్నంతలో హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేశామన్నారు. తమది జనాకర్షణ లేని సంపద సృష్టించే బడ్జెట్ అన్నారు. తన శాఖకు సంబంధించిన అంశాల్లో స్పష్టత ఇచ్చారని చెప్పారు. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు రాత్రికి రాత్రి ఏర్పడవని, కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.
సామాన్యుల పైన భారం పడకుండా పన్నులను హేతుబద్దం చేస్తూ సంపన్నులపై కొంత భారం వేశామన్నారు. అన్ని రంగాలు పుంజుకుంటూనే అభివృద్ధి సాధ్యమన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బడ్జెట్ రూపొందించామన్నారు. తమది బాధ్యతతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం అన్నారు. తమ పాలనలో ప్రాంతీయ వివక్ష ఉండదని చెప్పారు.












Click it and Unblock the Notifications