వైఎస్ షర్మిల పీసీసీ ఛీఫ్ అవుతున్న వేళ ఏపీలో కాంగ్రెస్ దుస్ధితి ఇదీ..!
ఉమ్మడి ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజించాక విభజిత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఒక్కసారిగా దారుణంగా మారిపోయింది. సర్పంచ్ పోస్టుకు టికెట్ ఇస్తామన్నా తీసుకునే వారే లేరు. గత పదేళ్లుగా ఇదే పరిస్ధితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసేందుకు ఒకప్పుడు కాంగ్రెస్ కు జీవం పోసి వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, కేంద్రంలోనూ భారీగా ఎంపీల్ని అందించిన వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు.
రేపు వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాష్ట్రంలో జీరోగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కనీస స్ధాయికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసేందుకు సిద్దమవుతున్నారు. విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిలకు తొలిరోజే పెను సవాల్ ఎదురవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అయిన గవర్నర్ పేటలోని ఆంధ్రరత్నభవన్ లో ఆమె పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.

కానీ ఆంధ్రరత్న భవన్ లో షర్మిల పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టే పరిస్దితి లేదు. పెచ్చులూడిపోయిన స్లాబ్, పైపైన రంగులేసిన దశాబ్దాల నాటి భవనం, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్ధితుల్లో షర్మిల అక్కడికి వస్తే భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆహ్వానం ఫంక్షన్ హాల్లో ఆమె బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ ప్రమాణ స్వీకారం చేశాక అధికారికంగా పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు మాత్రమే ఆంధ్రరత్న భవన్ కు షర్మిల రానున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత నేతల్ని, కార్యకర్తలని వైసీపీకి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోయాలంటే షర్మిల ఏ స్దాయిలో కష్టపడాలో కనిపిస్తూనే ఉంది. కానీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పీసీసీ కార్యాలయాల్ని కొత్తగా నిర్మించుకోలేని దుస్ధితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి రావడం కష్టంగా మారిన ఏపీలో పీసీసీ కార్యాలయం నిర్మించడం అసాధ్యం. దీంతో షర్మిల ఎక్కడి నుంచి కార్యకలాపాలు సాగించాలన్న దానిపై ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆంధ్రరత్న భవన్ కు కార్యకర్తలు, నేతలు భారీగా వస్తే తట్టుకునే పరిస్దితి లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications