పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై తేల్చేసిన హైకోర్టు- సంచలన నిర్ణయం..!
ఏపీలో తాజాగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇవాళ ఈ రెండు స్ధానాల్లో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు కూడా వెలువడ్డ వేళ వాటిని బాయ్ కాట్ చేసిన వైసీపీ.. హైకోర్టును ఆశ్రయించింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు ఇచ్చింది. ఇవాళ వెలువడిన ఫలితాల నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానాల్లో మొన్న జరిగిన ఉపఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, పోలీసుల సాయంతో అధికార పార్టీ ఏకపక్షంగా ఈ ఎన్నికలను తమవైపుకు తిప్పుకుందని, కాబట్టి వీటిని రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఇరు సీట్లలో అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పులివెందుల అభ్యర్ధి తుమ్మల హేమంత్ రెడ్డి, ఒంటిమిట్ట అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని తోసిపుచ్చింది.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానాల్లో రీపోలింగ్ పై తుది నిర్ణయం ఈసీ చేతుల్లోనే ఉంటుందని హైకోర్టు పిటిషనర్లు అయిన వైసీపీ అభ్యర్దులకు తేల్చిచెప్పేసింది. కాబట్టి ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తెలిపింది. దీంతో ఇవాళ ఈ రెండు సీట్లలో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్ధులకు హైకోర్టు నిర్ణయం మరో షాకిచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో వైసీపీ వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
పులివెందుల జడ్పీటీసీ స్ధానం పరిధిలో 15 పోలింగ్ బూత్ లలో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోరుతూ వైసీపీ ఈ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈసీ ఇప్పటికే అభ్యంతరాలపై కొన్ని బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించినందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈసీ కూడా రీపోలింగ్ విషయంలో ఇప్పటికే వైసీపీ నేతలకు తేల్చిచెప్పేసింది.












Click it and Unblock the Notifications