చంద్రబాబుకు బెయిల్ పైనా దక్కని ఊరట ! మరో వారం జైల్లోనే ! సుప్రీం ఎఫెక్ట్..
ఏపీలో స్కిల్ స్కాం కేసులో సీఐడీ అరెస్టు తర్వాత రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ మరింత ఆలస్యం కానుంది. గతంలో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడటమే ఇందుకు కారణం. దీంతో సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం తేలే వరకూ విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ పై నిర్ణయం తీసుకునేందుకు మొగ్గు చూపలేదు.
స్కిల్ స్కాం కేసులో ఓవైపు చంద్రబాబు బెయిల్ కోరుతుండగా... మరోవైపు సీఐడీ అధికారులు మరో ఐదు రోజుల కస్టడీ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లపై ఇవాళ కూడా విచారణ చేపట్టినప్పటికీ విజయవాడ ఏసీబీ కోర్టు ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న చంద్రబాబు క్వాష్ పిటిషనే. ఈ వ్యవహారం తేలకుండా తాము బెయిల్ లేదా కస్టడీ ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ఏసీబీ కోర్టు తమ నిర్ణయాన్ని వాయిదా వేసేసింది.

సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇవాళ వాదనలు సాగుతాయని భావించినా ధర్మాసనంలో జడ్జి ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మీ కోరడంతో ఈ వ్యవహారం సీజే బెంచ్ కు చేరింది. దీనిపై చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా ప్రత్యేక విజ్ఞప్తులతో విచారణ చేపట్టినప్పటికీ సీజే బెంచ్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకు బెయిల్ కోరుతున్నారా అంటే లూథ్రా లేదని తేల్చిచెప్పేశారు. అసలు ఈ కేసే చెల్లదని వాదించారు. దీంతో తదుపరి విచారణను వరుస సెలవుల కారణంగా అక్టోబర్ 3కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు కూడా అటు బెయిల్ పై కానీ, ఇటు కస్టడీపై కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక ఈ రెండు పిటిషన్లపై విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసేసింది. అంటే మరో వారం రోజుల పాటు చంద్రబాబు జైల్లోనే మగ్గబోతున్నారు. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లోనూ చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపైనా అదే రోజు విచారణ జరుపుతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.












Click it and Unblock the Notifications