తెగని సీపీఎస్ పంచాయితీ - కేంద్ర నిధులతో లింకు : సీఎం ఇంటి ముట్టడి టెన్షన్..!!
ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి సీపీఎస్ వ్యవహారం సవాల్ గా మారుతోంది. ఉద్యోగులను ఒప్పించి జీపీఎస్ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు నష్టం లేకుండా ఈ విధానం ద్వారా మేలు చేస్తామని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇదే అంశం పైన ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇప్పటికే సీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 1న సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. తాజాగా.. మంత్రి బొత్సా నివాసంలో సీపీఎస్ ఉద్యోగులతో చర్చలు జరిగాయి.

ఫలితం లేకుండానే ముగింపు
సీపీఎస్ అమలు చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని మంత్రులు బుగ్గన, బొత్స చెప్పినట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. చర్చల సమయంలో మరోసారి పాత అంశాలనే మంత్రులు ప్రస్తావించారంటూ ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ఓపీఎస్ అమలు సాధ్యం కాదని తెలిసి హామీ ఎందుకిచ్చారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు కంట్రిబ్యూషన్ ఆరు నెలలుగా చెల్లించడం లేదని.. మోసపోయామనే భావనలో సీపీఎస్ ఉద్యోగులందరూ ఉన్నారన్నాని చెప్పుకొచ్చారు.

ససేమిరా అంటున్న ఉద్యోగ సంఘాలు
తాము ఎటువంటి ఉద్రిక్తతలకు అవకావం లేకుండా.. శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామని చెబుతున్నా అనుమతి ఇవ్వటం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎస్ ఉద్యోగులందరూ బ్లాక్‌డే నిర్వహిస్తారని వెల్లడించారు. ఇదే సమయంలో సీపీఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపైనా చర్చకు సిద్ధమని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. ఓపీఎస్ ఆర్థికభారంగా మారుతుందనే కేంద్రం సీపీఎస్ తెచ్చిందన్నారు. ఉద్యోగులతోపాటు 5 కోట్ల మంది అవసరాలను ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉందంటూ ఉద్యోగ సంఘాల నేతలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు.

1న కార్యక్రమాలు యథాతధం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే ప్రభుత్వం 95 శాతం వరకు అమలు చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు. మిగిలిన అయిదు శాతం హామీల్లో సీపీఎస్ ఒకటి ఉందన్నారు. ఓపీఎస్ విధానంలోనూ కొంత తగ్గేందుకు ఉద్యోగులు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో..ఇప్పుడు ఈ చర్చల్లో ఎటువంటి నిర్ణయం రాకపోవటంతో..సెప్టెంబర్ 1న పిలుపునిచ్చిన ఛలో విజయవాడ.. సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలపై ఉత్కంఠ నెలకొని ఉంది. మరోసారి ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల మధ్య ఇదే అంశం పైన చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.