ఆంధ్రులకేదీ రక్షణ?: పత్తిపాటి, వంద మంది కెసిఆర్‌లొచ్చినా అంటూ ఎమ్మెల్యే
విజయవాడ/ గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తీరుతో ఆంధ్రులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల ఇళ్లను కూలగొట్టారని మండిపడ్డారు. ఏడాది కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.
పునర్విభజన చట్టంలోని అంశాలను గవర్నర్ అమలు చేయనందుకే ఈ పరిస్థితి నెలకొందని మంత్రి వ్యాఖ్యానించారు. సెక్షన్-8 అమలు చేయకపోతే ఆంధ్రా ప్రజలకు రక్షణ ఉండదన్నారు. హైదరాబాద్‌లో అధికారం కోల్పోతారనే సెక్షన్-8ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు మాని ఆంధ్రుల హక్కులపై అన్ని పార్టీలు పోరాడాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు.

ఇదిలావుండగా, వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తమ ప్రాజెక్టులను తాకలేరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సాగర్ టెయిల్‌పాండ్ దగ్గర పరిస్థితిని యరపతినేని, పలువురు టీడీపీ నేతలు సమీక్షించారు. అనంతరం యరపతినేని మీడియాతో మాట్లాడారు.
తమ ప్రాజెక్టులను నిర్వహించుకునే శక్తి తమకుందని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ మాదిరిగా టెయిల్‌పాండ్ దగ్గర దౌర్జన్యం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. టెయిల్‌పాండ్ దగ్గరకు వస్తే పల్నాటి పౌరషం ఎలా ఉంటుందో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఏపీపై కేసీఆర్ తన మాట తీరును మార్చుకోవాలని యరపతినేని సూచించారు.












Click it and Unblock the Notifications