మనవడ్ని చూసుకునే టైమ్ లేదు, నా చేతికి వాచీ లేదు: చంద్రబాబు
విజయవాడ: తాను విలువలకు కట్టుబడి ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తన జీవితం తెరచిన పుస్తకమని, తన చేతికి ఉంగరం, గడియారం ఉండదని, తన జేబులో డబ్బులు కూడా ఉండవని ఆయన అన్నారు.
పార్టీ కమిటీలను ప్రకటించిన తర్వాత ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఉన్నవాళ్లు కూడా పక్కన ఉండరని అన్నారు. తన భార్య ఆమె పని ఆమె చేసుకుపోతుందని, తన మనవడిని చూసుకునేందుకు సమయం ఉండటం లేదన్నారు. తాను కుటుంబం కంటే పార్టీని ఎక్కువగా ప్రేమిస్తానని ఆయన చెప్పారు.

తన కుమారుడు నారా లోకేష్ పార్టీ కోసం సేవ చేస్తున్నాడని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లోకేష్ సమర్ధంగా నిర్వహిస్తున్నారన్నారని అందుకే ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చామని చంద్రబాబు వివరించారు. ఇది వారసత్వ రాజకీయం ఎలా అవుతుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇకనుంచి ఏపీ వ్యవహారాలు విజయవాడ నుంచి సాగుతాయని చంద్రబాబు ప్రకటించారు.
దమ్ముంటే మిగతా పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు నాయుడు సవాలు చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆస్తులు తమకు సంక్రమించిన సమయంలో ఉన్న విలువనే బ్యాలెన్స్ షీట్‌లో చూపిస్తామని చంద్రబాబు చెప్పారు. ఎప్పటికప్పుడు పెరిగి, తరిగే విలువను బ్యాలెన్స్ షీట్‌లో ఉండదని, ఈ వాస్తవాలను కూడా తెలుసుకోక పోవడం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. తెలివి తక్కువగా మాట్లాడొద్దని విపక్షాల నేతలనుద్ధేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications