చిరుకు ఎంతో గౌరవమిచ్చాం: రఘువీరా రెడ్డి అసంతృప్తి
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పుకార్ల పైన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
చిరంజీవి బిజెపిలో చేరుతున్నారనే ప్రచారాన్ని ఖండించారు. చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని, బిజెపిలోకి వెళ్లాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు.

ఏ పార్టీకైనా గెలుపోటములు తప్పవన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి వాచ్ డాగ్‌లా వ్యవహరిస్తామన్నారు.
కాగా, చిరంజీవి పార్టీ మారుతున్నారనే వార్తలను కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు కూడా ఖండించిన విషయం తెలిసిందే. చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రుద్రరాజు పద్మరాజు గురువారం స్పష్టం చేశారు. చిరంజీవి బిజెపిలోకి వెళ్లరని, సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications