అసెంబ్లీకి వస్తేనే జీతం..! స్పీకర్ వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇదే..!
ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత 11 సీట్లు మాత్రమే గెల్చుకున్న వైఎస్సార్సీపీకి తగినంత బలం లేదనే కారణంతో అధికార కూటమి సర్కార్ విపక్ష హోదా నిరాకరిస్తూ వస్తోంది. కానీ అసెంబ్లీలో ఉన్న ఒకే ఒక విపక్షం తామే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని జగన్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా బాయ్ కాట్ చేస్తున్నారు. దీంతో అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలను ఈ మధ్య స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు టార్గెట్ చేస్తున్నారు.
అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లిపోతూ జీతాలు తీసుకొంటున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే నో వర్క్ - నో పే ( పని చేస్తేనే జీతం) విధానం అమలు చేయాలంటూ తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. దీనిపై ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులు స్పీకర్ కామెంట్స్ పై అడిగిన ప్రశ్నకు జగన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ జీతాలు ఇవ్వకుండా ఓ విధానం తీసుకురావాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతిపాదిస్తున్నారు కదా అని జగన్ ను ప్రశ్నిస్తే... ఆ జీతాలపైనే బతికేంత పేదవారెవరూ లేరు ఇక్కడ, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారు. తద్వారా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకుండా చేసే విధానంపై ప్రభుత్వ విజ్ఞతకే వదిలిపెడుతున్నట్లు జగన్ చెప్పినట్లయింది. దీనిపై స్పీకర్, అధికారపక్షం ఎలా స్పందిస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications