'బాబుని దించేసే ఆలోచన, గాల్లో నిర్మిద్దామా', సాక్షిపై ఊగిపోయిన లోకేష్
విశాఖ: రాజధాని వద్దు, ప్రాజెక్టులు వద్దు, చివరకు విమానాశ్రయాలు వద్దంటూ ప్రతిపక్ష నేత జగన్ అడ్డుకుంటున్నారని, ఎయిర్ పోర్టులను భూమ్మీద కాకుండా గాలిలో నిర్మించే టెక్నాలజీ ఏమైనా ఉంటే ఆయన చెప్పాలని మంత్రి అయ్యన్న పాత్రుడు శనివారం ఎద్దేవా చేశారు.
జగన్ జైల్లో కూర్చోవడంతో క్రిమినల్ మైండ్ సెట్ ఏర్పడిందన్నారు. ఎప్పుడు చంద్రబాబును దింపేద్దామా, ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామా అనే భ్రమల్లో ఉన్నారని విమర్శించారు. మిరపకాయ గురించి తెలియని జగన్, మిర్చి రైతుల కోసం దీక్ష చేయడం విడ్డూరమన్నారు.

మూడోతరంతో కలిసి పని చేస్తున్నా.. అచ్చెన్నాయుడు
స్వర్గీయ నందమూరి తారక రామారావుతో జీవితం ప్రారంభించిన తనకు చంద్రబాబుతో పాటు అతని తనయుడు నారా లోకేష్‌తో పని చేసే అవకాశం దక్కడంతో తన జీవితం ధన్యమయిందన్నారు. లోకేష్‌తో పని చేయడం ద్వారా వారి కుటుంబంతో ఇది తనకు మూడో తంతె అన్నారు.

విశాఖలో కార్యాలయం ప్రారంభోత్సవం
శనివారం విశాఖలో టిడిపి పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గంటా శ్రీనివాస రావు, అయ్యన్న పాత్రుడు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు.

ఐవీఆర్ఎస్ ద్వారా నామినేటెడ్ పోస్టులు
సంస్థాగత ఎన్నికల్లో పార్టీ పదవులకు పోటీ పడేవారి వివరాలను ప్రతిపాదిస్తే కార్యకర్తలు, ప్రజల నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరించి అర్హులను ఎంపిక చేస్తామని లోకేష్ చెప్పారు. పార్టీ సంస్థాగత ఎన్నికలను ఈ నెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాలని సూచించారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి
ప్రజల కోసం నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని, పార్టీని నమ్ముకున్న వారికి భిన్నరకాల పదవులు ఇచ్చామని లోకేష్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కొంత ఇవ్వాల్సి ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

దొంగ మీడియా అంటూ సాక్షిపై ఆగ్రహం
దొంగ పత్రిక, దొంగ ఛానల్ (సాక్షి మీడియాపై) నడుపుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని, ఇటువంటి వారి ఆగడాలను తిప్పి కొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. తాను నాన్నకు, తాతకు చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి పనులనూ చేయబోనని, ప్రజలు, కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications