AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
ఏపీలో వచ్చే నెల 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ముగిసింది. అసెంబ్లీ, లోక్ సభ సీట్లకు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్దుల సంఖ్య తేలుతుంది. మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు గాను 5 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి. అలాగే పార్లమెంట్ ఎన్నికలకు వెయ్యి వరకూ నామినేషన్లు వచ్చాయి. అభ్యర్ధులు సమర్పించిన నామినేషన్ల అఫిడవిట్లను ఎన్నికల అధికారులు సీఈవో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కచ్చితంగా ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారన్నది తేలనుంది.అలాగే ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతలైన వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి పోటీ చేస్తున్న సీట్లలో ఓ మోస్తరుగా నామినేషన్లు దాఖలయ్యాయి.

సీఎం జగన్ పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ స్ధానంలో 45 నామినేషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో 32 నామినేషన్లు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం సీటులో 30 నామినేషన్లకు పైగా దాఖలయ్యాయి. అలాగే నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్ధానంలో 71 నామినేషన్లు వచ్చాయి. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలో 19 నామినేషన్లు వచ్చాయి. పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి పార్లమెంట్ స్ధానంలో 22 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ సీటులో 47 వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications