మన గెలుపు ఆపటం వాళ్ల వల్ల కాదు - ఈ గుండె బెదరదు : నా బలం ఒక్కటే - సీఎం జగన్..!!
పార్టీ ప్లీనరీ వేదికగా సీఎం జగన్ తన లక్ష్యం స్పష్టం చేసారు. రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన గెలుపు ఆపటం ఇప్పుడు తన పైన రాజకీయంగా ప్రయత్నాలు చేస్తున్న వారి తో సాధ్యం కాదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పార్టీ ఏర్పాటు ఒక సంఘర్షణతో మొదలైందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. పార్టీ ప్లీనరీ వేదికగా పార్టీ నేతలతో ఏం జరిగిందీ వివరించటంతో పాటుగా.. రానున్న రోజుల్లో ఏం చేయనుందీ వివరించారు. ఎన్నికుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు.. సంకల్పం మారలేదని స్పష్టం చేసారు. ఈ జగమంత కుటుంబం తన చేతిని ఏనాడు వీడలేదన్నారు. మన పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. కాబట్టి గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

పావురాల గుట్ట నుంచే సంఘర్షణ
వైఎస్సార్ మరణం తరువాత పావురాల గుట్టలో మొదలైన సంఘర్షణ తో 2011 లో పార్టీ వైసీపీ ఆవిర్భావం జరిగిందన్నారు. నాన్న ఆశయాల కోసం మనందరి ఆత్మాభిమానం కోసం పని చేశామని చెప్పుకొచ్చారు. అవమానాలు భరించి.. కష్టాలు ఎదిరించి..అవమానం భరించి- కష్టాలు ఎదరించి ..తనను ప్రేమించిన ప్రతీ ఒక్కిరికీ సెల్యూట్ అని పేర్కొన్నారు. అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం అని నిరూపించామన్నారు. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, ఎన్ని రాళ్లు పడినా.. ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా..ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదన్నారు. ప్రజలు మూడేళ్ల కిందట కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారన్నారు. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారని వివరించారు.

గజదొంగల ముఠా అంటూ ఫైర్
ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు దేవుడు పరిమితం చేశాడంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రతిక్షణం తపనపడ్డామన్నారు. అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.ప్రజలు నిలదీస్తారేమోనని టీడీపీ మేనిఫెస్టోని మాయం చేసిందని దుయ్యబటటారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను చూడటానికే టీడీపీ భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. కాబట్టి గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు అని సీఎం జగన్ అన్నారు. దుష్టచతుష్టయం మన పాలనలో మంచి ని ఓర్వలేక అబద్దాల విషప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారన్నారు.

మన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు
ఆ కట్టుకథల్ని, వాటికి అబద్ధాలు జోడించి ఎల్లోమీడియా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. గతంలో రాష్ట్రాన్ని దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా వ్యవహరించిందని విమర్శించారు. ఇప్పుడు అవకాశం లేక కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో ఉందన్నారు. మనది చేతల పాలన.. వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. తనకు చంద్రబాబు కు లాగా మీడియా మద్దతు లేకపోవచ్చని.. కానీ, తనకు ఉన్నది ఒక్కటే . అదే ప్రజల మద్దతు అని జగన్ ప్లీనరీ వేదికగా పేర్కొన్నారు. ప్లీనరీ ముగింపు సమయంలో అన్ని అంశాల పైన పూర్తిగా స్పందిస్తానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications