హెరిటేజ్: నిన్న తెలంగాణ.. నేడు జగన్ పార్టీ! లోకేష్‌పై..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ కంపెనీ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు ప్రారంభించింది! హెరిటేజ్ పాల పైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో హెరిటేజ్‌ను నిషేధించాలని పలువురు డిమాండ్ చేశారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గురువారం హైదరాబాదులో మాట్లాడుతూ.. చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్య పణంగా పెడుతున్నారని ఆరోపించారు. హెరిటేజ్ పాలలో కల్తీ జరుగుతోందని కేరళ ప్రభుత్వం గతంలో నిషేధం విధిస్తూ గెజిట్ కూడా ఇచ్చిందని చెప్పారు.

హెరిటేజ్ పాలలో కల్తీని రైతుల పైన నెట్టడం ఏమాత్రం సరికాదన్నారు. ప్రజల భద్రత కోసం ఆలోచన చేసి మాట్లాడాలని హితవు పలికారు. ధైర్యం ఉంటే తమ కంపెనీలో ఎలాంటి కల్తీ లేదని చెప్పాలని ఆయన సవాల్ చేశారు. తప్పులను ఇతరుల పైకి నెట్టడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.
రైతులు అమృతం ఇస్తే, తను ప్రజలకు విషం ఇస్తున్నాడన్నారు. నిఫుణులతో తనిఖీలు చేయించేంత వరకు హెరిటేజ్ ఉత్పాదనలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ పాలలో క్యాన్సర్ కారక ఉత్ప్రేరకాలు ఉన్నాయా లేదా స్పష్టం చేయాలన్నారు. ప్రజల కోసమే తాము ఈ డిమాండ్ చేస్తున్నామన్నారు. తమకు ఎటుంటి దురుద్దేశ్యాలు లేవన్నారు.
కాగా, తెలంగాణ శాసన సభలో హెరిటేజ్ పైన మంగళవారం, బుధవారం వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. కేరళలో హెరిటేజ్‌కు చెందిన పద్మనాభ ఉత్పత్తులు నిలిపేశారని తెరాస సభ్యులు ఆరోపించారు. దీనికి తెలంగాణ టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దీని పైన హెరిటేజ్ కూడా వివరణ ఇచ్చింది.
హెరిటేజ్ సంస్థ ప్రెసిడెంట్ సాంబశివ రావు బుధవారం స్పందించారు. కేరళ రాష్ట్రంలో తమ సంస్థ ఉత్పత్తులను నిషేధించారని చెప్పడం వాస్తవం కాదన్నారు.
హెరిటేజ్ సంస్థకు సొంతగా ఆవులు లేదా గేదెలు లేవని చెప్పారు. కేరళలో హెరిటేజ్ సంస్థకు చెందిన పద్మనాభ పాలను మాత్రమే నెల రోజుల పాటు నిలిపారని వివరణ ఇచ్చారు. ఆ పాలు తప్ప మిగతా ఉత్పత్తులు అన్నీ కేరళ రాష్ట్రంలో అమ్మకాలు జరిగాయన్నారు. పద్మనాభ పాలను కూడా నాణ్యతా ప్రమాణాలు చూశాక అమ్మేందుకు అనుమతించారని చెప్పారు.












Click it and Unblock the Notifications