అశ్లీల నృత్యాలు అడ్డుకున్న పోలీసులపై దాడి: ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి
ప్రకాశం: జిల్లా సింగరాయకొండ మండలం పాకాలపల్లెలో అశ్లీల నృత్యాలను అడ్డుకున్న పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో నిర్వహించిన అశ్లీల నృత్య ప్రదర్శనను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో గ్రామస్థులు ఎస్సై, హోంగార్డుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్, డీఎస్పీ గ్రామానికి చేరుకున్నారు. కాగా, పోలీసుల దాడిని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి
కర్నూలు: కంకర గనుల్లో నిలిచిన నీటిలో ఈతకు వెళ్లి పూడికలో ఇరుక్కుపోయి ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని గోరుమానుకొండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరుమానుకొండ గ్రామానికి చెందిన సువర్ణ, గోపీ దంపతుల కుమారుడు సురేంద్ర(18), రాజమ్మ, బాలు దంపతుల సంతానం కిషోర్(18), వార్డు మెంబర్ ప్రసాద్, గుండమ్మల కొడుకు సాయిసుబ్రమణ్యం(18) ముగ్గురు స్నేహితులు. వీరు ముగ్గురు మరికొందరితో కలిసి ఆదివారం తమ్మరాజుపల్లె గ్రామం సమీపంలోని కంకర గనుల్లో నిలిచిన నీటిలో ఈతకు వెళ్లారు.
నీళ్లలోకి దిగిన ఆ ముగ్గురు పూడికలో ఇరుక్కుపోయి బయటికి రాలేక మృతి చెందారు. వీరిలో ఒకరు డిగ్రీ, మరొకరు డిప్లొమా చదువుతున్నట్లు సమాచారం. ముగ్గురు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు కలచివేశాయి. విషయం తెలిసిన వెంటనే పాణ్యం ఎస్‌ఐ మురళీమోహన్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications