ఒడిశా రైలు ప్రమాదం: మిస్సయిన వారికోసం వాట్సప్ నెంబర్; ప్రభుత్వ చర్యలపై ఎంపీ విజయసాయి!!
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన అందర్నీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రైలు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 278 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. 900 పైగా ప్రయాణికులకు గాయాలపాలైనట్టు సమాచారం. ఇంకా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ధ్వంసమైన బోగీల నుండి క్షతగాత్రులను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
ఈ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, ఒక గూడ్సు రైలు ఢీ కొన్న ప్రమాద ఘటనతో బాలాసోర్ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఒడిస్సా రైలు ప్రమాద ఘటనలో ఏపీ వాసులు పెద్ద సంఖ్యలో ఉన్నారని సమాచారం.

మొత్తం 70మంది వరకు కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో దిగాల్సి ఉంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు రైల్వే స్టేషన్లలో మొత్తం 52మంది రిజర్వేషన్ ప్రయాణికులు బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కినట్టు సమాచారం. ఈ రైళ్ళు ప్రమాదానికి గురికావడంతో కోరమాండల్ రైలు ప్రమాదంలో బాధితుల వివరాలకోసం ఏపీ విపత్తుల నిర్వహణసంస్థ మిస్సైన వారి సమాచారం కోసం వాట్సాప్ నెంబర్ ను ఏర్పాటు చేసింది.
ఈ ప్రమాదంలో మిస్సయిన ఏపీ వాసులు సమాచారం కోసం 8333905022 నెంబర్ కు ప్రయాణికుల ఫోటో, ఇతర వివరాలను వాట్సప్ చేస్తే, పోలీస్‌శాఖతో సమన్వయ పరుచుకుని బాధితుల సమాచారం తెలియజేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గాయపడ్డ ఏపీ వాసులు క్షేమసమాచారాలు నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
సంఘటనా స్థలానికి మంత్రి అమర్ నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ ల బృందాన్ని సీఎం జగన్ పంపించారని వెల్లడించారు. అవసరమైతే ఘటనా స్థలానికి పంపించడానికి అంబులెన్సులు కూడా సిద్ధం చేశారని, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఏపీ ఒడిశా సరిహద్దు జిల్లాలలోని ఆసుపత్రులలో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications