ఏపీలో మళ్లీ పాత బ్రాండ్ల మద్యం వచ్చేసింది..!!
ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్. నాటి పాత బ్రాండ్ల మద్యం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఏపీలో అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్ల పైన మందుబాబుల్లో వ్యతిరేకత కనిపించింది. రాజకీయంగానూ ఈ బ్రాండ్ల పైన విమర్శలు వచ్చాయి. అయితే, ఎన్నికల ముందు అనూహ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో బార్లు, ప్రభుత్వ మద్యం షాపులకు అన్ని బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. పాత బ్రాండ్లు మళ్లీ రావడంతో మద్యం వ్యాపారం ఊపందుకుంటోంది.
ఎన్నికల సమయంలో ఏపీలో మళ్లీ పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బార్లు, మద్యం దుకాణాల్లో పాత బ్రాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. పాత బ్రాండ్లు తేవడంతో ఎన్నికల సమయంలో మంచి వ్యాపారం జరుగుతుందని బార్ల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే బార్లకు కావాల్సిన విధంగా బ్రాండ్లు సరఫరా చేస్తున్నారు. షాపులకు కూడా అన్ని బ్రాండ్ల మద్యం ఇస్తున్నా అన్ని షాపులకు ఇంకా పూర్తిస్థాయిలో చేరలేదు. ప్రభుత్వ నిర్ణయంతో బార్లలో వ్యాపారం కూడా కొంతమేర పెరిగింది. ప్రస్తుతం రోజుకు మొత్తం రూ.75కోట్ల మేర వ్యాపారం జరుగుతుండగా ఇకపై రోజుకు రూ.5 నుంచి రూ.10కోట్లు పెరిగే అవకాశం ఉంది.
ఏపీలో దాదాపు నాలుగేళ్ల కాలంగా అమ్మకం చేస్తున్న మద్యం బ్రాండ్ల గురించి ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేసారు. కొత్త పేర్లతో జరిగిన అమ్మకాల పైన మందుబాబుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. అయితే, ధరలు పెంచటం ద్వారా మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేయటమని ప్రభుత్వంలోని కొందరు నేతలు చెబుతూ వచ్చారు.
ఇదే సమయంలో పాత బ్రాండ్ల స్థానంలో కొత్త పేర్లతో అమ్మకాలు జరిగాయి. కానీ, ఆ మద్యం పైన మందుబాబుల్లో మాత్రం వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఈ బ్రాండ్లు ఆరోగ్యం పైనా ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు పాపులర్ బ్రాండ్ల కంపెనీలతో తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తిరిగి పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం కావటంతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications