ఏపీలో కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు - లక్షణాలు, జాగ్రత్తలు..!!
ఏపీలో నమోదు అవుతున్న కోవిడ్ కేసుల పైన స్పష్టత వస్తోంది. కొత్తగా తిరిగి కేసులు నమోదు అవుతుండటం.. నలుగురు ప్రాణాలు కోల్పోవటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలో గుర్తించిన 12 కేసుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపింది. కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 వేరియంట్‌ను పూణే ల్యాబ్‌లో గుర్తించారు. ఈ వేరియంట్ కు సంబంధించిన లక్షణాలు.. ముందస్తు జాగ్రత్తలను సూచిస్తున్నారు
ఏపీలో గుర్తించిన కోవిడ్ పాజిటివ్ కేసులను పరీక్షించారు. శాంపిల్స్ ను పూణేకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అక్కడ ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 వేరియంట్ గా గర్తించారు. ఈ వేరియంట్ ముందస్తు చర్యల పైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇది కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక ఉపవంశం, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో ఆర్ఎఫ్.5 కూడా ఒకటని మంత్రి ఒక పేర్కొన్నారు. ప్రపంచ సంస్థ ఈ వేరియంట్‌ను సాధారణ జీనోమిక్ పర్యవేక్షణలో భాగంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఓమిక్రాన్ ఆర్‌ఎఫ్-5ఎన్‌యు ఎస్ఎఆర్ఎస్-సిఓసి2 గా కూడా పర్యవేక్షిస్తోందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఆర్ఎఫ్.5 కేసులు కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు.

ఆరోగ్య శాఖ అప్రమత్తం
కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఆర్ఎఫ్.5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరమని ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆర్‌ఎఫ్.5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ ఉప-వేరియంట్ల లక్షణాల మాదిరిగానే ఉంటాయని తెలిపారు. ముఖ్యoగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, శరీర నొప్పులు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశామని, ప్రత్యేక వార్డులు, పడకలు, కోవిడ్ పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచామని మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటించటం.. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించటం వంటి వాటి ద్వారా వైరస్ కు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications