చంద్రబాబు చేయలేనిది.. చిటికెలో సాధించిన జూనియర్ ఎన్టీఆర్- నేరుగా ప్రధాని మోదీతోనే..!!
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు బొమ్మను రూ.100 నాణెం మీద ముద్రించాలంటూ కేంద్రం నిర్ణయించడాన్ని ఏపీ బీజేపీ స్వాగతించింది. దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం ఉందని తెలిపింది.
అమరావతి: చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని పెద్దలు చెబుతుంటారు. ఏ పని చేసినా నిబద్ధతతో చేయగలిగితే విజయాన్ని అందుకోవచ్చనే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరిగింది. తన తాత కోసం కమిట్ మెంట్ తో చేసిన ఒకే ఒక్క పని.. ఆయనను హీరోగా నిలబెట్టింది. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చి పెట్టింది.

భారత రత్న కోసం..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు- ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు నిర్వహించే మహానాడులో ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంటుంది. దీనిపై తీర్మానాల మీద తీర్మానాలు చేస్తూనే ఉంటుందా పార్టీ.

ఒక్కసారైనా..
ఈ డిమాండ్లు, ఈ తీర్మానాలు ఆ ఒక్కరోజుకు మాత్రమే పరిమితం. మళ్లీ మహానాడు వరకు చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ దాని పేరే ఎత్తరు. ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలనే విషయం మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక్కసారైనా లేఖ రాసిన సందర్భాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. గతంలో ఎన్డీఏ కూటమిలో తెలుుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా దీని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబు. ఇది ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి, నిబద్ధతకు నిదర్శనం.

ఒకే ఒక్క రిక్వెస్ట్ తో..
ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు చేయలేనిది- ఒకే ఒక్క రిక్వెస్ట్ తో జూనియర్ ఎన్టీఆర్ సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 100 రూపాయల వెండి నాణెం మీద ఎన్టీ రామారావు బొమ్మను ముద్రించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయడం వల్లే ఇది సాధ్యపడింది.

స్వయంగా వెల్లడించిన సోము..
ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా వెల్లడించారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా చేసిన విజ్ఞప్తి మేరకు వెండితో తయారు చేసే 100 రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఎన్టీ రామారావు శతజయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు.

ఎన్టీఆర్ బొమ్మతో..
ఎన్టీ రామారావు బొమ్మను ముద్రించిన 100 రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆర్బీఐ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. త్వరలోనే ఎన్టీ రామారావు బొమ్మతో 100 రూపాయల కాయిన్ ను ఆర్బీఐ విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications