కోతలు తగ్గించనున్న కేసీఆర్! ఏపీ రాజధానిపై పత్తిపాటి
హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలకు పవర్ హాలీడే ఒక్కరోజుకు తగ్గించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ పరిస్థితి మెరుగుపడుతుండటంతో ట్రాన్స్ కో ఎండీకి సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు వారంలో రెండ్రోజుల పాటు పవర్ హాలీడే ఉంది.
ఇదిలా ఉండగా, వచ్చే నెల 26వ తేదీన అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కేసీఆర్ భేటీ కానున్నారు. హైదరాబాదులో తాము నిర్వహించే విందుకు హాజరు కావాలని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సీఎంను కోరారు. అందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.
1992లో ఏర్పాటయిన ఈ సంస్థలో అమెరికాలో 73 రంగాలకు చెందిన 500 ప్రముఖ కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ కంపెనీలు తమ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

అందులో భాగంగా హైదరాబాదులోను ఈ విందు సమావేశాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపిన సీఎం ఆ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించి, అమెరికా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాజధానిపై పత్తిపాటి పుల్లారావు
కృష్ణానదికి దక్షిణం వైపున ఆంధ్రప్రదేశ్ రాజధాని వస్తుందని, గుంటూరు జిల్లాలోని 17 గ్రామాల్లో తొలి విడత భూసేకరణ చేపడతామని ఏపీ సీఎం పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాదులో రాజధాని కమిటీ సమావేశమవుతుందన్నారు.
నవంబర్ 1 నుండి భూసమీకరణ కార్యాచరణ ప్రారంభిస్తామని, ప్రభుత్వ భూములతో పాటు ప్రయివేటు భూములను సేకరిస్తామన్నారు. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారన్నారు. రైతులకు ఆసక్తికరమైన రీతిలో భూసమీకరణ విధానం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications