బెజవాడలో కారు రేస్: ఒకరు మృతి, కలకలం

మీడియా కథనాల ప్రకారం - వాహనాల రేసుల సందర్భంగా ఓ కారును మరో కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఒక కారు మరో కారుని ఢీకొట్టింది. రెండు కార్లూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ కిందపడి నుజ్జునుజ్జయ్యాయి. సినిమా స్టంట్‌ను తలపించే ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ఎనిమిదిమంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదం సంచలనం సృష్టించింది. ఇది మామూలు ప్రమాదం కాదని కారు యువకులు పోటీపడి కార్లను పరుగులు తీయించడవల్లే సంభవించిందని ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటన జరిగిన తీరు, ప్రత్యక్ష సాక్షుల కథనం, ఆ కార్లలో ప్రయాణిస్తున్న విద్యార్థులు చెప్పిన పొంతనలేని సమాధానాలను పరిశీలిస్తే ఇది కార్ రేస్‌గానే భావించాల్సి వస్తుందని ఓ పోలీస్ అధికారి అభిప్రాయపడ్డారని ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. నిత్యం రద్దీగా ఉండే ఐదోనంబర్ జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం తీవ్ర సంచలనం సృష్టించింది.
యడ్లపాడు సమీపంలో వారిలో వెనుక వస్తున్న కారు ఓవర్ టేక్ చేసే క్రమంలో ముందు కారును ఢీకొట్టింది. దీనితో రెండు వాహనాలు పల్టీలు కొట్టాయి. అయితే, అదృష్టవశాత్తూ ఓ కారు పల్టీలుకొట్టి యథాతథంగా నిలబడటంతో అందులో ఉన్నవారు గాయాలతో బయటపడ్డారు. మరో కారు తలకిందులుగా పడి నుజునుజ్జు కావడంతో అందులో ఉన్న ఐదుగురిలో నాగేందర్ మృతి చెందగా మిగిలినవారు గాయపడ్డారు.
ప్రమాద సమయంలో రెండు కార్లలోని పదిమందీ ఇంజనీరింగ్ విద్యార్థులే కావడం గమనార్హం. ప్రమాదం జరగ్గానే ఎమ్మెల్యే కుమారుడితోపాటు మరో నలుగురు పారిపోగా, మిగిలిన నలుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూసిన వారు 8మంది బతికి బయటపడ్డారంటే నమ్మలేదు. ప్రమాదం తర్వాత క్షతగాత్రులలో ఒకరు ఒంగోలు వెళ్తున్నామంటే, మరొకరు చెన్నై వెళ్తున్నామని చెప్పారు. చివరకు పోలీసుల విచారణలో చిలకలూరిపేటలో శుభకార్యానికి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదంతా చూస్తే రెండు కార్లు విజయవాడ నుంచి నిర్దేశిత ప్రాంతానికి రేస్‌లో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ విషయాలను బయటకు వెల్లడించడం లేదని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది.
ఈ రేసింగులలో విజయవాడకు చెందిన టిడిపి ఎమ్మెల్యే తనయుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోందంటూ ఆ పత్రిక రాసింది. నెలన్నర క్రితం ఎమ్మెల్యే తనయుడి ఆధ్వర్యంలో యువకులు నాలుగు ద్విచక్రవాహనాలపై రేసింగ్‌కు వచ్చి కాజ టోల్‌గేట్ వద్ద మంగళగిరి రూరల్ పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో ఎమ్మెల్యే తనయుడు ఉండటంతో పోలీసులు వారిని మందలించి పంపారు. తాజాగా యడ్లపాడు వద్ద ఆదివారం జరిగిన ఘటనలో ఆ ఎమ్మెల్యే కుమారుడు ప్రమాదానికి గురైన రెండు కార్లలో ఒక దానిని నడిపినట్లు తెలిసింది. దీంతో ఇది రేసువల్ల జరిగిన ప్రమాదమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి.












Click it and Unblock the Notifications