ఆ ఒక్క నిబంధన-25 కోట్లు మిగుల్చుకున్న వైసీపీ సర్కార్-లక్షమందికి పెన్షన్లు దూరం

ఏపీలో వైసీపీ సర్కార్ ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. ఏ రోజు కారోజే, ఏ వారం ఆ వారమే, ఏ నెల ఆ నెలే అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. అప్పుల కోసం ఎక్కని గడప లేదు, దిగని గడప లేదు. దీంతో ఖజానాపై సంక్షేమ పథకాల అమలు ద్వారా పడుతున్న ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు దారులు వెతుకుతోంది. ఇందులో భాగంగా తాజాగా పింఛన్ల విషయంలో తీసుకున్న ఓ నిర్ణయం నెల రోజుల్లోనే దాదాపు రూ.25 కోట్లు ప్రభుత్వానికి మిగిల్చింది. ఆ మేరకు లక్ష మంది లబ్దిదారుల ఉసురుతీసింది కూడా.

 అప్పుల్లో జగన్ సర్కార్

అప్పుల్లో జగన్ సర్కార్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నాయి. ఈ కాలంలో ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలును నెత్తికెత్తుకుంది. నవరత్నాల పేరుతో ప్రకటించిన మ్యానిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేసే క్రమంలో ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అయినా లెక్కచేయకుండా ముందుకే వెళుతోంది. ఇదే క్రమంలో మరిన్ని అప్పుల కోసం దారులు కూడా వెతుకుతోంది. చివరిగా సంక్షేమ పథకాలకు కోతలు విధించేందుకు సిద్ధం కాక తప్పని పరిస్దితి వచ్చేసింది. దీంతో క్రమంగా సంక్షేమ పథకాలపై సమీక్షలు పెరుగుతున్నాయి. అదే స్ధాయిలో కొత్త నిబంధనలు కూడా తెరపైకి వచ్చేస్తున్నాయి. ఇవి అంతిమంగా లబ్దిదారులకు షాకులు ఇస్తున్నాయి.

 పింఛన్లలో కోతలు

పింఛన్లలో కోతలు

వైసీపీ సర్కార్ వైఎస్సార్ ఆసరా పేరుతో అమలుచేస్తున్న సామాజిక పింఛన్లను సమీక్షించేందుకు కొన్ని నెలలుగా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నారు. ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఉంటే ఒకటి కట్. ఒకే రేషన్ కార్డులో ఇద్దరు పింఛన్ దారులుంటే ఒకరికి కట్, కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తుంటే పింఛన్ కట్, ఇలా వీలైనన్ని రూపాల్లో పింఛన్లలో కోతలు పడుతున్నాయి. విచిత్రంగా ఇలా కోతలు పడుతున్న లబ్దిదారులంతా వైసీపీ హయాంలో ఉదారంగా పింఛన్లు తీసుకునేందుకు గతంలో ఎంపికైన వారే. వివిధ సర్వేలు చేసి వీరిని ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కోతల ద్వారా వీరి భారం తగ్గించుకునేందుకు వ్యూహాలు సిద్దం చేస్తోంది.

 కొత్త నిబంధనల షాక్

కొత్త నిబంధనల షాక్

పింఛన్ల విషయంలో ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త కొత్త నిబంధనలు లబ్దిదారులకు షాకులిస్తున్నాయి. పెన్షన్ల హేతుబద్ధీకరణ, అనర్హులకు చెక్ పేరుతో సాగుతున్న ఈ తంతులో భాగంగా ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధన తీసుకొస్తోంది. తద్వారా పింఛన్ల భారాన్ని అంతకంతకూ తగ్గించుకుంటోంది. కానీ లబ్దిదారులు మాత్రం లబోదిబో మంటున్నారు. గతంలో అధికారంలోకి రాగానే సామాజిక పింఛన్లను రూ.3 వేలకు పెంచుతామని చెప్పిన వైఎస్ జగన్.. ఇప్పుడు ఆ ఊసెత్తడమే మానేశారు. దీనికి తోడు కొత్తగా కోతలు పెడుతున్నారు. ఇందుకోసం అధికారులు నిబంధనల బూజు దులుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా తీసుకొచ్చిన ఓ నిబంధన గత నెలలో భారీగా లబ్దిదారుల్ని వదిలించుకునేందుకు సర్కార్ కు ఉపయోగపడింది.

 అదే నెలలో పింఛన్ రూల్

అదే నెలలో పింఛన్ రూల్

ప్రభుత్వం రెండు నెలల క్రితం పింఛన్ల విషయంలో ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. గతంలో రెండు, మూడు నెలలు పింఛన్ తీసుకోకపోయినా దాన్ని భద్రంగా దాచిపెట్టి పింఛను దారులకు ఇచ్చేవారు. ఇలా పింఛన్ తీసుకునేవారంతా ముసలీ ముతకా కావడం, సుదూర ప్రాంతాల్లో ఉంటుండటం వల్ల నెలకోసారి వచ్చి పింఛన్ తీసుకునేందుకు వీల్లేక ఒకేసారి వచ్చి రెండు, మూడు నెలల పింఛన్ తీసుకునే వారు. కానీ ప్రభుత్వం ఏ నెల పింఛన్ ఆ నెలలోనే తీసుకోవాల్సిందేనంటూ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధన సెప్టెంబర్ నెల నుంచి అమల్లోకి వచ్చింది. అంటే నెల రోజులు పూర్తయ్యాయన్న మాట. ఈ కొత్త నిబంధన కారణంగా భారీ సంఖ్యలో లబ్దిదారులు పింఛన్ కోల్పోతున్నారు.

 నెల రోజుల్లో లక్ష పింఛన్ల కోత

నెల రోజుల్లో లక్ష పింఛన్ల కోత

ఏ నెల పింఛన్ అదే నెలలో తీసుకోవాలనే నిబంధన సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నెల రోజుల్లో లక్ష మంది వరకూ లబ్దిదారులు పింఛన్ కోల్పోవాల్సి వచ్చింది. వీరంతా సుదూర ప్రాంతాల్లో ఉండటమో, ఇతరత్రా కారణాలతోనో సెప్టెంబర్లో పింఛన్ తీసుకోలేకపోయారు. దీంతో ఏ నెల పింఛన్ ఆ నెలలోనే నిబంధన కారణంగా వీరు తమ పింఛన్ ఈ నెలలో తీసుకునేందుకు వీల్లేకుండా పోయింది. వీరంతా ఇప్పుడు గ్రామ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు కూడా ప్రభుత్వం విధించిన నిబంధన గుర్తు చేస్తూ తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

    AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu
     రూ.25 కోట్లు మిగుల్చుకున్న జగన్ సర్కార్

    రూ.25 కోట్లు మిగుల్చుకున్న జగన్ సర్కార్

    ఏ నెల పింఛన్ ఆ నెలలోనే తీసుకోవాలన్న కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం మొదటి నెలలోనే రూ.25 కోట్ల మేర పింఛన్ మొత్తాల్ని మిగుల్చుకుంది. ఈ నెలలో ఇళ్ల వద్ద అందుబాటులో లేని వారు, ఆరోగ్య కారణాలతో పింఛన్లు తీసుకోవాల్సిన వారు తీసుకోలేక పోవడంతో ఈ మొత్తం సర్కార్ కు మిగిలినట్లు తెలుస్తోంది. ఈ పింఛన్లు తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా లేకపోవడంతో ప్రభుత్వానికి ఆ మేరకు ఆదా అయినట్లే. ఈ లెక్కన నెలకు రూ.25 కోట్లు మిగిలనా ఏడాది తిరిగే సరికి దాదాపు రూ.300 కోట్లు జగన్ సర్కార్ మిగుల్చుకోనుంది. దీంతో ఇదే కోవలో ప్రభుత్వంపై ఆర్ధికభారం తగ్గించేందుకు అన్ని శాఖల్లోనూ ఇలాంటి మరిన్ని నిబంధనల్ని అధికారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి కోతలు పడతాయో తెలియక లబ్దిదారులు బెంబేలెత్తుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+