జమిలి వేళ.. ఆరా మస్తాన్ ఎంట్రీ- వస్తూనే
One Nation- One Election: దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సైతం పూర్తయింది. దీని తరువాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్.
ఈ పరిస్థితుల్లో- రాజకీయంగా ఉత్కంఠతను రేకెత్తిస్తోన్న వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మరో కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ అయిదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను నిర్వహించబోతోన్నామనే సంకేతాలను పంపించింది.

గతంలో ఈ జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫాసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ ఇప్పటికే అందజేసిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కూడా.
పూర్తిస్థాయిలో చర్చ అనంతరం ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం యధాతథంగా ఆమోదించింది. త్వరలో ఏర్పాటు కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2027లో ఏ క్షణంలోనైనా జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా అధినేత ఆరా మస్తాన్ తెరపైకి వచ్చారు. దేశంలో జమిలి ఎన్నికల వాతావరణం క్రమంగా నెలకొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కీలక అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈసీ నుంచి జవాబును కోరారు.
రాష్ట్రంలో ముగిసిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ఆయన తాజాగా ప్రస్తావించారు. పోలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ ఈసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచే ఫామ్- 20 గురించి ప్రశ్నించారు. ఈ విషయంలో ఈసీ అనుసరించే విధి విధానాలను గుర్తు చేశారు.
సాధారణంగా పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఫామ్ 20ని ఈసీ తన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటుందని, ఏపీ విషయంలో మాత్రం ఆ ప్రక్రియ పూర్తయిన 100 రోజులకు ఎందుకు అప్‌లోడ్ చేయాల్సి వచ్చిందని ఆరా మస్తాన్ ప్రశ్నించారు. దీనిపై తనకు సమాధానం ఇవ్వగలరా? అని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications