టీడీపీ జనసేన లిస్టులో ఒకే మైనార్టీ అభ్యర్ధి ! ఆశలు వదిలేసుకున్నట్లేనా ?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ విపక్ష టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఇవాళ విడుదల చేశారు. టీడీపీ 94, జనసేన ఐదుగురు అభ్యర్ధులు కలిపి మొత్తం 99 మందితో చంద్రబాబు, పవన్ విడుదల చేసిన ఉమ్మడి జాబితాలో కనిపించిన ఏకైక మైనార్టీ అభ్యర్ధి పేరు ఎన్ఎండీ ఫరూక్. నంద్యాల అసెంబ్లీ సీటుకు ఫరూక్ ను ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ స్ధానంలో ఇన్ ఛార్జ్ గా ఉన్న ఫరూక్ కు పోటీ చేసే అవకాశం కల్పించారు.
అయితే దాదాపు 100 పేర్ల జాబితాలో ఇరు పార్టీలు కలిపి ఒకే ఒక్క మైనార్టీ అభ్యర్ధికి చోటు కల్పించడం చూస్తుంటే ఆయా పార్టీల వ్యూహం అర్ధమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ తర్వాత వైసీపీకి గంపగుత్తగా మళ్లింది. వచ్చే ఎన్నికల్లో అది తిరిగి తమవైపుకు మళ్లుతుందన్న ఆశలు లేవు. ఇలాంటి పరిస్దితుల్లో ఇతర సామాజిక వర్గాలను కాదనుకుని మైనార్టీ అభ్యర్ధులకు సీట్లు కేటాయించినా ఫలితం ఉండదేమో అన్న భయంతోనే టీడీపీ, జనసేన ఇలా చేశాయన్న ప్రచారం జరుగుతోంది.

మరోవైపు వైసీపీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఐదుగురు మైనార్టీ అభ్యర్ధులకు జగన్ సీట్లు కేటాయించారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. హిందూపురంలో ఇక్బాల్ మాత్రమే ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయనకూ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మైనార్టీ ఓటు బ్యాంకును సుస్ధిరం చేసుకునే ప్రయత్నంలో ఈసారి కూడా జగన్ పలు కొత్త సీట్లలో మైనార్టీలకు చోటు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన మైనార్టీ ఓటు బ్యాంకుపై ఆశలు వదులుకున్నట్లు ఇవాళ ప్రకటించిన జాబితా స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications