ఏపీవైపు ఆపరేషన్ సింధూర్ పార్ట్ నర్ చూపు..! కీలక ఆఫర్..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఈ కాలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారు. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ది వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వం కూడా ఎక్కడ చిన్న అవకాశం దొరికినా పెట్టుబడుల ఆకర్షణకు వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మరో కీలక పెట్టుబడిదారు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతోంది.
ఈ ఏడాది పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సింధూర్ లో రక్షణశాఖకు డ్రోన్లు సరఫరా చేసిన గరుడ ఏరోస్పేస్ సంస్థ ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇవాళ రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డితో గరుడ ఏరో స్పేస్ (GARUDA AEROSPACE) సంస్థ ప్రతినిథులు భేటీ అయ్యారు. సచివాలయంలో ఈ మేరకు మంత్రితో భేటీ అయి చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు గరుడ ఏరో స్పేస్ సంస్థ తమ సానుకూలతను వ్యక్తం చేసింది. చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ సంస్థకు డ్రోన్స్ ఉత్పత్తిలో విశేష అనుభవం ఉంది. గతంలో ప్రతిష్టాత్మకమైన ఆఫరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా దాదాపు 500కు పైగా డ్రోన్స్ ను అందజేసిన ఘనత సైతం గరుడ ఏరో స్పేస్ సొంతం. ఇప్పుడు అదే సంస్థ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేసింది.

గరుడ ఏరోస్పేస్ సంస్థలో ప్రముఖ భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భాగస్వామిగా ఉన్నాడు. గరుడ ఏరోస్పేస్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సైతం ధోనీ వ్యవహరిస్తున్నాడు. గరుడ ఏరోస్పేస్ ఆసక్తిపై స్పందించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతన పెట్టుబడులు రాకతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications