అవయవదానం: ముగ్గురికి ప్రాణం, ఇద్దరికి చూపు
విశాఖపట్నం: పోతూ పోతూ కృష్ణచంద్ర ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించాడు, మరో ఇద్దరికి కంటిచూపును ఇచ్చాడు. విశాఖ జిల్లాలో ఒక కుటుంబం తమ కుటుంబ పెద్ద మరణించగా, ఆయన అవయవాలను దానం చేశారు. దాంతో ముగ్గురికి పునర్జన్మ లభించడంతో పాటు ఇద్దరికి లోకాన్ని చూసే అవకాశం దొరికింది. వైద్య నిపుణులు అవయవ దాత నుంచి సేకరించిన రెండు కిడ్నీలను ఇరువురికి, కాలేయాన్ని ఒకరికి అమర్చి ముగ్గురికి జీవితాన్నిచ్చారు. రెండు కళ్లను కూడా ఇతరులకు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సంఘటన ఆదివారం విశాఖ నగరంలోని కేర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. దీనివల్ల అవయవ దాత మరణించినా మరో ఐదుగురిలో జీవించి ఉన్నట్టేనని ఆయన కుటుంబ సభ్యులు, వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని అయ్యవారిపేటకు చెందిన కృష్ణ చంద్ర ప్రైవేటు బస్సు కండక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య శారద, కొడుకు జగదీశ్వర, కుమార్తె పూర్ణిమ ఉన్నారు. కృష్ణచంద్ర గురువారం రాత్రి ఇచ్ఛాపురం నుంచి ఇంటికి వస్తూ మార్గమధ్యంలో కళ్లు తిరిగి పడిపోయారు.

తలకు తీవ్రమైన గాయమవ్వడంతో స్థానికులు గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు కృష్ణచంద్రకు ఇచ్ఛాపురంలో ప్రథమ చికిత్స అనంతరం బరంపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు శనివారం ఉదయం విశాఖలోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి కృష్ణచంద్రకు బ్రెయిడ్ డెడ్ అయిందని, బతకడం అసాధ్యమని తేల్చేశారు. కృష్ణచంద్ర బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యుల ద్వారా తెలుసుకున్న జీవన్‌దాన్ కో-ఆర్డినేటర్ ఇందిర ఈ విషయాన్ని జీవన్‌దాన్ చైర్మన్ డాక్టర్ రవిరాజ్‌కు తెలియజేశారు.
అనంతరం ఆమె కృష్ణచంద్ర భార్య శారద, కుమారుడు జగదీశ్వర్‌ను కలిసి అవయవ దానానికి వారిని ఒప్పించారు. వైద్య నిపుణులు డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ మోహన్ మహరాజ్ బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి కళ్లు, లివర్, కిడ్నీలను సేకరించారు. ఇరువురి రోగులకు అపోలో ఆస్పత్రిలో కిడ్నీలు అమర్చారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరికి లివర్ అమర్చారు. రెండు కళ్లను మోషిన్ ఐ బ్యాంక్‌లో భద్రపరిచారు. వీటిని ఇద్దరు అంధులకు సోమవారం అమర్చనున్నారు.












Click it and Unblock the Notifications