కేసీఆర్! ఓయుతో పెట్టుకుంటే అంతే, వర్సిటీలో తెరాసపై యుద్ధం
హైదరాబాద్: ఇళ్లు కట్టించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఓయు విద్యార్థులు నిప్పులు చెరుగుతున్నారు. నిన్న తెలంగాణ ఉద్యమానికి వేదిక అయిన ఓయు నేడు కేసీఆర్‌పై మరో ఉద్యమానికి సిద్ధమవుతోంది.
ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంస్థలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి. కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నాయి. ఓయు భూములు లాక్కోవాలని చూస్తే మరో ఉద్యమానికి ఓయు వేదిక అవుతుందని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.
బుధవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్ పిలుపునిచ్చింది. బుధవారం నాడు ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ భూములను తీసుకుని పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఓయూ భూములను తీసుకుంటే ఊరుకునేది లేదని విద్యార్థులు హెచ్చరించారు. కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఓయూ ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ కల సాకారం అయిందన్నారు.

విద్యార్థుల త్యాగ ఫలితంగా కేసీఆర్ సీఎం కుర్చీపై కూర్చున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఓయూపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఓయూలో ఇప్పటి వరకు సుమారు 1300 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఓయూకు సంబంధించిన భూములను తిరిగి సంపాదించాల్సింది పోయి ఇప్పుడు కొత్తగా భూములెలా తీసుకుంటారని విద్యార్థులు ప్రశ్నించారు.
నాగం హెచ్చరక
కేసీఆర్‌కు బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థుల వల్లే తెలంగాణ వచ్చిందని, ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్ర మరువలేనిదని అన్నారు. విద్యార్థులను కేసీఆర్ బచ్చాగాళ్ల అనడం విడ్డూరమన్నారు. కేసీఆర్ ఆ సీటుపై కూర్చునేందుకు విద్యార్థులే కారణమన్నారు.
విద్యార్థులతో పెట్టుకుంటే దగ్ధమవుతారన్నారు. ఉస్మానియా విద్యార్థుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. అలాంటిది వారి పైనే ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఉస్మానియా అంటే పోరాడాల గడ్డ అన్నారు.












Click it and Unblock the Notifications