154 స్థానాల్లో మహిళా ఓటర్లే నిర్ణేతలు - మద్దతు వారికేనా, లెక్క క్లియర్..!!
ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. మరో పది రోజుల్లో పోలింగ్ జరగనుంది. అధినేత ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన పార్టీలు ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో, మహిళా ఓటర్లు ఏపీలో ఎవరి వైపు ఉన్నారు. నివేదికలు చెబుతున్నదేంటి.
మహిళా ఓటర్లే కీలకం
ఏపీలో ఓటర్ల వివరాలను ఎన్నికల సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. తుది ఓటర్ల జాబితాలో ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 2,00,74,322 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2,03,39,851కి చేరింది. మహిళా ఓటర్లు 2,07,29,452 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2,10,58,615కి చేరింది. ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య గతంలో 3,482 ఉండగా ఇప్పుడు 3,421గా నమోదైంది.

సర్వీసు ఓటర్లు 67,434 ఉండగా ఇప్పుడు 68185కి చేరింది. గతంలో కన్నా సర్వీసు ఓటర్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లున్న జిల్లాల్లో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 20,56,203 మంది ఓటర్లు ఉన్నారు. రెండోస్థానంలో ఉన్న అనంతపురంలో 20,20,243 మంది ఉన్నారు.
154 నియోజకవర్గాల్లో ప్రభావం
రాష్ట్రంలో 26 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పురుష ఓటర్లు మహిళా ఓటర్ల కన్నా ఎక్కువగా ఉండగా తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
ఇక, 154 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 21 నియోజకవర్గాల్లో మహిళలకంటే పురుషులు అధికంగా ఉన్నారు. టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, చీపురుపల్లి, గాజువాక, పిఠాపురం, పి.గన్నవరం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, మడకశిర, దర్శి, హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు.
మహిళా ఓటర్లు ఎవరివైపు
154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటంతో వారే కొత్త ప్రభుత్వాన్ని డిసైడ్ చేయనున్నారు. దీంతో, పార్టీలు సైతం తమ మేనిఫెస్టోలో మహిళలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసాయి. జగన్ తొలి నుంచి మహిళా ఓట్ బ్యాంక్ పైనే గురి పెట్టారు. నవరత్నాల లబ్దిదారులు ప్రధానంగా మహిళలే ఉన్నారు.
అదే విధంగా టీడీపీ కూటమి సూపర్ సిక్స్, తాజా మేనిఫెస్టోలోనూ మహిళా పథకాలకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో పాటుగా కాంగ్రెస్ సైతం మహిళలకు కొత్త పథకాలు ప్రకటించింది. దీంతో..మహిళలు ఏపార్టీకి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. సంక్షేమ పథకాల కేంద్రంగా మహిళా ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. దీంతో...ఇప్పుడు ఏపీలో ఎవరిని మహిళలు అధికారంలోకి తీసుకొస్తారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications