తెలంగాణలో మజ్లిస్ జెండా: అక్బర్ అరెస్ట్ కలిసొచ్చిందా?
హైదరాబాద్: మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో మజ్లిస్ పార్టీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గెలిచిన విషయం తెలిసిందే. మజ్లిస్ పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టు ఆ పార్టీకి కలిసి వచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలలో మజ్లిస్ పార్టీ భైంసాను దక్కించుకుంది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో రంగారెడ్డిలోను ఖాతా తెరిచింది. అక్బర్, అసద్‌లు చేసిన ప్రసంగాలు, వారి పైన కేసులు, అరెస్టులు ఆ పార్టీకి కలిసి వచ్చి తెలంగాణలో పలు ప్రాంతాల్లో గెలిచే పరిస్థితి వచ్చిందని లెక్కలు వేస్తున్నారు. వారి అరెస్టు నేపథ్యంలో ఆ వర్గం ఓట్లు పెద్ద మొత్తంలో మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు పడి ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా హిందూ అభ్యర్థులను నిలబెట్టడంతో ఆ ఓట్లు కూడా పడ్డాయని అంటున్నారు.

అదిలాబాద్, నిర్మల్, భైంసా తదితర ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసు, తెరాస తరఫున నిలబడిన ముస్లిం అభ్యర్థులను కాదని మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు ఓటేశారు.
గత ఏడాది రెచ్చగొట్టే ప్రసంగం కేసులో అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టు చేసి అదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. అక్బరు జైల్లో దాదాపు నెల రోజులు ఉన్నాడు. నిజామాబాదులోను అతని పైన కేసు నమోదయింది. అక్కడి కోర్టులోను అతనిని హాజరుపర్చారు. మరోవైపు మెదక్ జిల్లా సంగారెడ్డి కేసులో అసదుద్దీన్ ఓవైసీని అరెస్టు చేశారు. ఇవి ఆ పార్టీకి కలిసి వచ్చాయంటున్నారు.












Click it and Unblock the Notifications