వినుకొండలో వైసీపీ నేత హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన
Vinukonda Murder: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య.. కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో సంభవించిన వరుస హత్యలు, అత్యాచార ఘటనలను రాష్ట్రపతికి వివరించాలని నిర్ణయించింది.

వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్‌ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలానీ నడిరోడ్డుపై నరికి చంపాడు. చేతులు నరికాడు. మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటన పట్ల వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక శాంతి భద్రతలు కరవయ్యాయని విమర్శించింది. రోజుకో హత్య, అత్యాచార ఘటనలు సంభవిస్తోన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వినుకొండలో పార్టీ నాయకుడు షేక్ రషీద్ హత్యోదంతం.. దీనికి పరాకాష్టగా పేర్కొంది.
ఈ హత్యోదంతంపై పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెంటెండ్ కంచి శ్రీనివాస రావు కీలక ప్రకటన చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు. ఎటువంటి పార్టీల ప్రమేయం ఉన్నట్లు ప్రస్తుతానికి కనిపించట్లేదని అన్నారు.
ఇప్పటివరకు ఇద్దరి మధ్య గల వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు కనిపిస్తోందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications