పార్టీకి విధేయురాలు - క్యాన్సర్ ను జయించి: అనురాధ మేయర్ టు ఎమ్మెల్సీ..!!
పంచుమర్తి అనురాధ. ఎమ్మెల్సీగా గెలవటంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అనురాధ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2000లో విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఆ సమయంలో చంద్రబాబును కలిసారు. మొత్తం 18 మందిని మేయర్ సీటు కోసం ఇంటర్వ్యూ చేసిన చంద్రబాబు చివరకు మేయరు అభ్యర్థిగా.. అనురాధను ప్రకటించారు. 26 ఏళ్ల వయసులోనే మేయర్ గా గెలిచారు. అప్పట నుంచి పార్టీ విధేయురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ అయ్యారు.
అనురాధ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే.. పారిశ్రామికవేత్త శ్రీధర్‌తో ఆమెకు వివాహమైంది. చిన్న వయసులోనే మేయర్ అయిన అనురాధ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. విజయవాడ మేయర్ గా పని చేసిన సమయంలో పూర్తిగా చంద్రబాబు పై ఆధారపడేవారు. పలు అభివృద్ధి పథకాలకు నిధులు తెచ్చారు. అన్నింటికీ ప్రభుత్వం నుంచే నేరుగా జీవోలు వచ్చేవి. ఎమ్మెల్సీ పదవికి ఆమె పేరును చంద్రబాబు గతంలోనే ప్రతిపాదించినా తిరస్కరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి లభించింది. 23 సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకున్న అనురాధ ఇప్పుడు అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ పెద్దల సభకు ఎంపికయ్యారు.

టీడీపీలో సమర్ధవంతంగా పని చేస్తున్న సమయంలో అనూరాధకు క్యాన్సర్ సోకింది. ధైర్యం కోల్పోకుండా చికిత్స పొందారు. క్యాన్సర్ ను జయంచారు. ఆ తరువాత కూడా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత కూడా పార్టీ వ్యవహారాల్లో సమర్ధవంతంగా పని చేసారు. పార్టీ వాయిస్ వినిపించే టీడీపీ మహిళా ముఖ్య నేతల్లో అనురాధ ఒకరు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సామాజిక సమీకరణాల్లో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు అనూహ్యంగా అనురాధను ఎంపిక చేసారు. అనురాధ పార్టీలో తనకు సుదీర్ఘంగా ఉన్న పరిచయాలతో పార్టీని వీడి వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మద్దతు కోరారు. వారి నుంచి ఓట్ల రూపంలో మద్దతు అందకపోయినా.. అనూహ్యంగా వైసీపీ నుంచి నలుగురి క్రాస్ ఓటింగ్ తో అనురాధ గెలుపొందారు.

ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. టీడీపీ వరుసగా గెలిచిన మూడు పట్టభద్రుల స్థానాలు..ఇప్పుడు ఎమ్మెల్సీ సీటుతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. అనురాధ గెలిచిన సమయంలో వైసీపీ నుంచి గెలిచిన అభ్యర్దులు..ఏజెంట్లు కూడా శుభాకాంక్షలు చెప్పారు. గెలిచినట్లుగా సర్టిఫికెట్ అందుకున్న వెంటనే అనురాధ నేరుగా పార్టీ అధినేత చంద్రబాబును కలిసారు. విజయవాడ మేయర్ గా రాజకీయ పదవులు ప్రారంభించిన అనురాధ..ఇప్పుడు అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణమయ్యారు.












Click it and Unblock the Notifications