తెలంగాణ మంత్రులను ఏకేసిన పరకాల ప్రభాకర్
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నీటి వాడకంపై తెలంగాణ మంత్రులు చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఆయన సోమవారం ఏపి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 233లో జీవోలో 834 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చనే విషయం ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్లా చెబుతున్నారని మండిపడ్డారు.
107 జీవోకు, 170 జీవోకు మధ్య తేడా ఏమిటో ఆంగ్ల పాండిత్యం కలిగిన తెలంగాణ మంత్రి హరీశ్ రావుకి తెలియదా? ప్రశ్నించారు. 170జీవో నికర జలాల విషయంపై ఏపి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అప్పుడే అభ్యంతరం చెప్పారని అన్నారు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, అబద్ధాల డైలీ సీరియల్‌ను ఇకనైనా ఆపాలని పరకాల ప్రభాకర్ అన్నారు. మీ నీటిని మీరు వాడుకుంటే తమకు అభ్యంతరం లేదనీ, తమకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాలో వేలుపెడితే సహించేది లేదని టి మంత్రులనుద్దేశించి అన్నారు.
ఇక విద్యుత్ విషయంలో కూడా తమకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ రావాలని అడుగుతున్నారని, అవి ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు. దానికి ఏమైనా లెక్క ఉందా? అన్న ఆయన, ఎక్కడెక్కడ రావాల్సిన దానికన్నా అదనంగా తీసుకుంటున్నారో కూడా లెక్కలు చెబుతాననని అన్నారు. థర్మల్ విద్యుత్తులో ఏపి ఉత్పత్తి చేసిన దాంట్లోంచి 769 మిలియన్ యూనిట్లు తెలంగాణకే ఇచ్చామని చెప్పారు.

జల విద్యుత్తులో కూడా ఆంధ్రా డిస్కంలు 1621, తెలంగాణ డిస్కంలు 2224 మిలియన్ యూనిట్ల చొప్పున వాడుకున్నాయన్నారు. ఇలా అన్ని చోట్లా ఎక్కువ వాడుకుంటూ.. తమ మీద తప్పు నెట్టడం తెలంగాణ మంత్రులకు తగదని అన్నారు. మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని, తెలంగాణ, ఏపి ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో విద్యుత్ సమస్యతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని సిఎం చెబుతుంటే.. మరో మంత్రి విద్యుత్ కారణం కాదని చెబుతున్నారని పరకాల ఆరోపించారు. రోజుకో అబద్ధం పుట్టించడం తప్ప తెలంగాణ మంత్రులకు మరో పని లేకుండా పోయిందని పరకాల మండిపడ్డారు.












Click it and Unblock the Notifications