హోరెత్తించారు: అసెంబ్లీలో ప్రాంతాలుగా పార్టీల 'విభజన'
హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో వెంటనే తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పెట్టి చర్చకు అనుమతించాలని తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు, సమైక్య తీర్మానం చేయాలని సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.
ఇరు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలను పక్కన పెట్టి ప్రాంతాల వారీగా అసెంబ్లీలో విడిపోయారు. తెలంగాణ ప్రాంత తెలుగుదేశం, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, బిజెపి, తెరాస ఎమ్మెల్యేలు బిల్లుపై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.

వారికి ధీటుగా సీమాంధ్ర టిడిపి, సీమాంధ్ర కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు కూడా సమైక్యంపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ పోడియం చుట్టుముట్టారు. ఇటీవల వచ్చిన తుఫానుల కారణంగా నష్టపోయిన అంశంపై చర్చకు సహకరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కోరినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభ రెండోసారి అరగంటపాటు వాయిదా పడింది.
ఢిల్లీలో ఉభయ సభలు వాయిదా
పార్లమెంటులో కూడా విభజన అంశం వేడిని రాజేస్తోంది. శుక్రవారం కూడా సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, వి వాంట్ జస్టిస్ అని డిమాండ్ చేస్తూ ఉభయ సభలను అడ్డుకున్నారు. దీంతో లోకసభను ఒంటి గంట వరకు, రాజ్యసభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. అంతకుముందు కూడా ఉభయ సభలు ఒకసారి వాయిదాపడ్డాయి.












Click it and Unblock the Notifications