టీడీపీలో చేరిన పాతపట్నం ఎమ్మెల్యే: వైసీపీకి 8 మంది హ్యాండ్ ఇచ్చారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం టీడీపీలోకి చేరారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి విజయవాడలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు.
అనంతరం వెంకటరమణకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలోకి వెంకటరమణ చేరికతో టీడీపీ ప్రారంభించిన 'ఆపరేషన్ ఆకర్ష్' లో భాగంగా వైసీపీకి 8 మంది ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కలమటతో పాటు ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు కూడా టీడీపీలో చేరారు.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్‌పై విజయం సాధించిన కలమట వెంకటరమణ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడనయ్యే ఆ పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. వ్యవసాయానికి చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

తమ నియోజక వర్గంలో అభివృద్ధి జరుగుతుందని, ఈ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడింది కాబట్టే టీడీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు చంద్రబాబు సైతం తన నియోజక వర్గ అభివృద్ధికి హామీ ఇచ్చారని కలమట చెప్పారు. కలమట తండ్రి మోహన్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ కోరిక మేరకే తాను ఆరోజుల్లో టీడీపీలో చేరానని అన్నారు.

మేము ఎలాంటి ప్రలోభాలకు లోనై తెలుగుదేశం పార్టీలో చేరలేదని అన్నారు. తాను గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, నేను టీడీపీలో ఉన్న హయంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని మళ్లీ ఇప్పుడు మా నియోజక వర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications