ఇంగీత జ్ఞానం లేదు, ప్రజల కన్నీళ్లు తుడవలేని మీకెందుకు అధికారం?: బాబుపై పవన్
Recommended Video

టెక్కలి: ప్రజా సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునేవారే లేరన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపించడం లేదని మండిపడ్డారు.
బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి కిడ్నీ బాధితులతో సమావేశమైన అనంతరం.. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టే ప్రభుత్వం, పేదల కన్నీళ్లను తుడవలేక పోతోందని ఆరోపించారు.

ప్రజల కన్నీళ్లు తుడవలేని అధికారం మీకెందుకు? అని పవన్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై స్వయంగా చంద్రబాబును కలిసి విన్నవించినా.. కనీసం ఇక్కడి ప్రజలకు ప్రభుత్వం స్వచ్చమైన తాగునీరు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఉన్నా లేనట్టేనని అన్నారు. అరకొరగా డయాలసిస్ సెంటర్స్ పెట్టి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. అసలు డయాలసిస్ దాకా ప్రజలు వచ్చేవరకు ఏం చేస్తున్నారని, ముందే మందులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఒక్కటి ప్రజలకు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇన్ని బాధలు పడుతుంటే.. పాలకులకు ముద్ద ఎలా దిగుతుందో అర్థంకావడం లేదన్నారు. కనీసం ఇంగీత జ్ఞానం లేకుండా పాలకులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఇది ప్రజల దౌర్భాగ్యమేనని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications