రేపు విశాఖలో పవన్, ఫ్యాన్స్‌కి..: తెలంగాణ సాయమిది..
హైదరాబాద్/విశాఖ: హుధుద్ తుఫాను బాధితులకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు ఇచ్చారు. రూ.50 లక్షల చెక్కును తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇస్తానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరు బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు సూచించారు. తాను తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తానని చెప్పారు. కాగా, పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. తుఫాన్ బాధిత ప్రాంతాలలోని ప్రజలను పరామర్శిస్తారు.

విశాఖకు చేరుకున్న ప్రధాని
తుభాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సిఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్‌లు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్న మోడీ తొలుత దెబ్బతిన్న విమానాశ్రయాన్ని పరిశీలించారు. అనంతరం ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరారు. చంద్రబాబు, మోడీలు ఓకే కారులో ప్రయాణిస్తూ నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. బాబు స్వయంగా మోడీకి పరిస్థితిని వివరిస్తున్నారు.
ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్న నదులు
హుధుద్ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదులు పొంగిపొర్లుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా పాతపట్టణం మండలంలోని మహేంద్రతనయ, గుమ్మెగడ్డకు వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో 31 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగావళికి వరద పోటెత్తడంతో 70వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
వంశధారలో 70వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌లో నీటిమట్టం భారీగా పెరుగుతోంది. దీంతో రిజర్వాయర్ నుంచి 1.15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొప్పన, ఈదనాపల్లి గ్రామాలకు ముప్పు పొంచివుంది. దీంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
విజయనగరం జిల్లాలోనూ తుపాను బీభత్సం సృష్టించింది. సాలూరు మండలంలోని గోముఖి డ్యాంకు గండిపడింది. దీంతో 2 వేల ఎకరాల్లో వరిచేలు నీటమునిగాయి. ఎలమంచిలిలో పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జిల్లాలో దాదాపు 12వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.
తెలంగాణ ప్రభుత్వం సాయం
హుధుద్ తుఫాను ధాటికి అతలాకుతలమైన ఏపీకి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తోంది. రూ.18 కోట్ల విలువైన విద్యుత్ సామాగ్రిని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకి పంపించింది. 530 ట్రాన్సుఫార్మర్లు, 28,500 విద్యుత్ స్తంభాలు, 900 కిలో మీటర్ల వైర్లు పంపినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications