మిడిమిడి జ్ఞానం ఉన్నవారు పాలకులైతే మాతృభాష మృతభాషగా మారే ప్రమాదం: పవన్ కళ్యాణ్
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మాతృభాషను కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని యునెస్కో నిర్ణయించడంతో 2000 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవాలని తద్వారా మన జీవవైవిద్యాన్ని కాపాడుకోవడం కోసం యునెస్కో తీసుకున్న ఈ నిర్ణయంతో ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా భాష యొక్క గొప్పతనాన్ని చెప్పి, మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

అమ్మభాష గొప్పతనాన్ని చెప్పిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తెలుగు భాష పట్ల విపరీతమైన మక్కువను చూపించే వ్యక్తి. తెలుగు భాష పరిరక్షణ కోసం అనేకసార్లు తనదైన శైలిలో స్పందించిన వ్యక్తి. ఇక తాజాగా అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా భాషను పరిరక్షించుకోవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ప్రజలే భాషోద్ధారకులు కావాలంటూ పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన మనోవికాసానికి మూలధనం మాతృభాష అంటూ పేర్కొని అదే అమ్మ భాష అని అమ్మ భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు.

తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
బిడ్డకు ఉగ్గుపాలతోనే లోకజ్ఞానాన్ని కలిగించేది మాతృభాషేనని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఉపాంగమైన యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీన ప్రతిఏటా మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ఎంతో ముదాహమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సుదినాన్ని పురస్కరించుకొని తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

మాతృ భాష మృత భాషగా మారకుండా కాపాడాల్సింది ప్రజలే
మాతృభాష పదిలంగా ఉన్నప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలు పదిలంగా ఉంటాయని తెలిపిన పవన్ కళ్యాణ్ అప్పుడే జాతి సజీవంగా, సగర్వంగా అలరారుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మిడిమిడి జ్ఞానం కలిగిన వారు పాలకులు అయితే మాతృభాష మృత భాషగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలతో పరోక్షంగా జగన్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అటువంటి క్లిష్ట సమయాల్లో ప్రజలే భాషను ఉద్ధరించే వారిగా మారవలసిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు .

ఉన్నత విద్యలో మాతృభాషను ప్రోత్సహించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా నియమితులైన శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి యుజిసి చైర్మన్ మామిడాల జగదీష్ గారు రాసిన లేఖలో ఉన్నత విద్యలో మాతృభాషను ప్రోత్సహించాలని, పాఠ్యపుస్తకాలు మాతృభాషలో అందించేలా చూడాలని కోరారు. యుజిసి చైర్మన్ మామిడాల జగదీష్ పేర్కొన్న అంశాలను ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జయతే మాతృభాష.. జయ జయహే తెలుగు భాష అంటూ పవన్ కళ్యాణ్ మాతృభాష పై తన భాషాభిమానాన్ని వ్యక్తం చేశారు. భాషను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పారు.












Click it and Unblock the Notifications