అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం కష్టాల పాలైందని, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు.
ప్రాథమిక అంచనా మేరకు మూడు లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని సమాచారం అందుతోందని, వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. వారికి అండగా ఉండి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటల గణన సత్వరమే చేపట్టి మానవతా దృక్పథంతో వారికి పరిహారాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

వరి పంటను సాగు చేసిన రైతులను అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయని, ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలో సాగు చేసిన జయ రకం ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ధాన్యాన్ని ఆర్బీకేలలో తీసుకోకపోవడం వల్ల బస్తాను 300 రూపాయల నష్టంతో రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తుందని, దళారులు, మిల్లర్లు లాభ పడుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరి మూలంగా కష్ట పడిన రైతు నష్టపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు చేతికొచ్చిన మామిడి పంట నేల రాలిపోయిందని, మొక్కజొన్న కూడా మొలకెత్తుతోందని, ఇటువంటి కష్ట కాలంలో రైతులకు భరోసా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఇదే సమయంలో రైతాంగం కోసం ప్రత్యేక పాలసీలు తీసుకువస్తామని, రైతు ప్రతినిధులు, వ్యవసాయ ఆర్థిక నేతలతో చర్చిస్తున్నామని పేర్కొన్న పవన్ కళ్యాణ్ రైతుల కష్టాలు తను కళ్లారా చూశానని అన్నారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులు ముఖ్యంగా కౌలు రైతుల ఆవేదన కళ్లారా చూశానన్నారు.
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/rSyUJNgL2W
— JanaSena Party (@JanaSenaParty) May 2, 2023
నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వారి పొలాలలో, కల్లాలలో కలిసినపుడు వారు పడిన బాధలు తెలుసుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో వారి ఆవేదన విన్నానని రైతుల్ని ఆదుకోవడానికి ప్రత్యేకమైన విధానాన్ని తీసుకువస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications