బాబు ఏదీ చెప్పలేదు, డిమాండ్లివే: పవన్ దీక్ష ప్రారంభం, షాకిచ్చిన పోలీసులు అందుకే ఇలా
శ్రీకాకుళం: ఉద్ధానం సమస్య పరిష్కారం కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు చేయనున్నారు. కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేనాని 17 డిమాండ్లను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందు ఉంచారు.
ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, వెంటనే ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఆయన టీడీపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆయన దీక్షకు దిగారు. తన ఒక్కరోజు దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు పిటిషన్ ఇచ్చారు.

పోలీసుల నుంచి రాని అనుమతి, రిసార్టులోనే దీక్ష
పవన్ కళ్యాణ్ దీక్షకు పోలీసుల నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది. దీంతో ఆయన తాను రెండు రోజులుగా ఏ రిసార్టులో ఉంటున్నారో, అదే రిసార్టులో దీక్షకు పూనుకున్నారు. ఆయన గురువారం సాయంత్రం నుంచే ఘన ఆహారపదార్థాలను తీసుకోవడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్ధానం సమస్యకు పరిష్కారం చూపాలన్న డిమాండ్‌పై స్పందించక పోవడంతో దీక్షకు దిగారు. ప్రభుత్వం ముందు ఆయన పదిహేడు డిమాండ్లు పెట్టారు.

ఆ కక్కుర్తి లెక్కలు కట్టిపెట్టాలి
1. ఉద్ధానంలోని అన్ని గ్రామాలలోను మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎప్పటికి అప్పుడు నిర్వహించాలి. 2. డయాలసిస్ కేంద్రాలలో తక్షణం నెఫ్రాలజిస్టులను నియమించాలి. డయాలసిస్ కేంద్రాలను పెంచాలి. ఈ కేంద్రాలకు అనుబంధంగా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి. 3. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను సక్రమంగా, ఉచితంగా అందించాలి. కొన్నే ఉన్నాయి.. మిగిలిన వాటిని బయట కొనుక్కోండి అనే సమాధానం రాకూడదు. 4. డయాలసిస్ చేయించుకున్నవారు ఆ స్టేజీకి చేరిన వారి వివరాలు పక్కాగా నమోదు చేయాలి. ఫించన్లు మిగుల్చుకునే కక్కుర్తి లెక్కలు కట్టిపెట్టాలి.

పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి
5. డయాలసిస్ చేయంచుకునే వారికే కాదు అన్ని స్టేజీలలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ అందించాలి. 6. కిడ్నీ వ్యాధితో బాధపడే వారికి ఉచిత రవాణా సౌకర్యం ఉండాలి. 7. శుద్ధి చేసిన రక్షిత మంచి నీటిని ఇంటింటికి అందించాలి. అందుకు సంబంధించిన ప్లాంట్లను త్వరితగతిన పూర్తి చేయాలి. 8. ఉద్ధానంలో ఈ వ్యాధి ప్రబలడానికి గల మూలాలను అన్వేషించి పరిశోధన కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలి
9. శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా స్వయంగా అక్కడి కిడ్నీ ప్రభావిత ప్రాంతానికి సంబంధించిన సమస్యను పర్యవేక్షిస్తారు. మన రాష్ట్రంలో ఉద్ధానం కిడ్నీ సమస్యను సీఎం పర్యవేక్షించాలి. నివారణకు చర్యలు చేపట్టాలి. ఇందుకు ప్రత్యేక యాక్షన్ టీం ఏర్పాటు చేయాలి. 10. రాష్ట్రానికి తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలి. 11. ఉద్ధానం ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి.

కేంద్రం తప్పించుకోవద్దు, నేతలు దత్తత తీసుకోవాలి
12. కేంద్ర ప్రభుత్వం ఉద్ధానం సమస్య తమ పరిధిలోనిది కాదని తప్పించుకోవద్దు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ అంశంపై దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని తగిన సహాయ, సహకారాలు అందించాలి. 13. శ్రీకాకుళంలోని ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే కిడ్నీ రోగులను దత్తత తీసుకొని వారికి తగిన వైద్యం అందుతుందో లేదో పర్యవేక్షించాలి.

మొత్తం 17 డిమాండ్లు పెట్టిన పవన్
14. కార్పోరేట్ సంస్తలు సీఎస్ఆర్‌లు భాగంగా ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేయాలి. ప్రతి కార్పోరేట్ ఆసుపత్రి విధిగా తమ వైద్య సిబ్బందిని తమ వద్ద ఉన్న నెఫ్రాలజిస్టులను ఈ ప్రాంతానికి ఎప్పటికప్పుడు పంపించి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. 15. ఉద్ధానం ప్రాంతంలోను ప్రతి ఒక్కరికి శశాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి తొలిదశలో ఉన్న వారిని తక్షణం గుర్తించి మందులు ఉచితంగా ఇవ్వాలి. 16. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించాలి. 17. శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తక్షణమే నెఫ్రాలజిస్టులను నియమించాలి.

పవన్ దీక్షపై ప్రకటన
పవన్ దీక్ష గురించి జనసేన ప్రకటన విడుదల చేసింది. ఉద్దానం సమస్యపై పవన్ విధించిన 48 గంటల గడువు పూర్తయిందని, చంద్రబాబు సమీక్ష అనంతరం జారీ చేసిన ప్రకటనకు, క్షేత్రస్థాయిలోని వాటికి పొంతన లేదని, సీఎం ప్రకటన చేయలేదని, ఈ నేపథ్యంలో పవన్ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ప్రజల మధ్య ఉంటారని పేర్కొన్నారు. అప్పటి వరకు ఆయన రిసార్టులో దీక్ష చేయనున్నారు. జన సైనికులు శాంతియుతంగా దీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖకు మంత్రి లేకుంటే సంరక్షణ చర్యలు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. వ్యాధి నిర్మూలనకు చంద్రబాబు ప్రణాళిక ప్రకటించలేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications