మోడీ రోడ్ మ్యాప్ ఎఫెక్ట్ ! పవన్, చంద్రబాబు తలోదారి ! అమల్లోకి తాజా స్ట్రాటజీ ?
ఏపీలో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని గట్టి పట్టుదలతో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ తో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు విషయంలో కొత్త వ్యూహం అమలుచేస్తున్నారు. దీన్ని గ్రహించిన చంద్రబాబు తాను కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ఎంత సమయం ఉందో కచ్చితంగా నిర్ధారణ కాకపోవడంతో నిత్యం జనాల్లో ఉండాలన్న కామన్ వ్యూహం మాత్రం ఇద్దరూ అమలు చేస్తున్నారు.

మోడీ రోడ్ మ్యాప్ ఎఫెక్ట్
ప్రధాని మోడీ విశాఖ టూర్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓ రోడ్ మ్యాప్ ఇచ్చారు. అయితే అది ఆయన కోరుకున్న రోడ్ మ్యాప్ కాకపోయినా దాన్ని తప్పక అమలు చేయాల్సిన పరిస్దితి. దీంతో అయిష్టంగానే దీని అమలును ప్రారంభించిన జనసేనాని ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో పవన్ వ్యూహాల్ని గ్రహించిన చంద్రబాబు కూడా తన వ్యూహానికి పదునుపెడుతున్నారు. దీని ఫలితమే గత కొన్నిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలుగా చెప్పుకోవచ్చు.

పవన్, చంద్రబాబు తలోదారి!
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో విపక్షాలు ఉమ్మడిగా పనిచేస్తున్నాయన్న విషయం వైసీపీకీ అర్ధమైంది. అలాగే ఉమ్మడిగా పనిచేయక తప్పని పరిస్ధితి విపక్షాలది. కానీ ఇప్పుడే ఆ ఉమ్మడి వ్యూహాలు బయటకు వచ్చేస్తే ఇక ఎన్నికల నాటికి వచ్చే కిక్కేముంది. అందుకే అటు పవన్ కానీ, ఇటు చంద్రబాబు కానీ ఆ తుది వ్యూహాన్ని ఇప్పుడే బయటపెట్టేందుకు సిద్ధంగా లేరు.
దీని స్దానంలో ప్రస్తుతానికి తాత్కాలిక వ్యూహంతోనే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. దీని ప్రభావంతోనే చంద్రబాబు జిల్లాలు చుట్టేస్తుండగా..పవన్ రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్దమవుతున్నారు. దీంతో వీరిద్దరూ తలోదారి ఎంచుకున్నట్లు అర్ధమవుతోంది.

పరస్పర ప్రస్తావన లేకుండా?
గతంలో చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఉమ్మడిగా స్పందించేవారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. కానీ ఎక్కడా ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాగే ఒకరి గురించి మరొకరు ప్రస్తావన తెచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎక్కడా పవన్ చంద్రబాబు ప్రస్తావన కానీ, చంద్రబాబు పవన్ ప్రస్తావన కానీ తీసుకురావడం లేదు. తద్వారా వీరిద్దరి మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే సస్పెన్స్ ను తుదికంటా కొనసాగించాలని భావిస్తున్నారు. ఎన్నికల వరకూ ఇదే స్ట్రాటజీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అచ్చం మోడీ చెప్పినట్లే..?
ప్రధాని మోడీ విశాఖ టూర్ లో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు దూరంగా ఉండాలని సూచించినట్లు వార్తలొచ్చాయి. అప్పటి నుంచి చంద్రబాబు గురించి పవన్ మాట్లాడింది లేదు. అలాగే తన సొంత వ్యూహాలపైనే ఆధారపడాలని భావిస్తున్నారు. చంద్రబాబు కూడా అంతే. రాబిన్ శర్మ సాయంతో తన వ్యూహాల్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
జిల్లాల టూర్లలో వరుసగా రోడ్ షోలు నిర్వహించడం, రోజుకో కొత్త నినాదం, స్ధానికంగా జనం ఆలోచనల ఆధారంగానే ప్రకటనలు చేయడం వంటివి చేస్తున్నారు. మరోవైపు పవన్ కూడా వారాహి పేరుతో వాహనం తయారు చేసుకుని ఎన్నికల ప్రచారం కోసం సిద్ధమవుతున్నారు.
దీనిపై వస్తున్న విమర్శలకు కూడా వెంటనే బదులిస్తున్నారు. తద్వారా వాటిని జనంలోకి వెళ్లేలోపే కౌంటర్లు ఇస్తూ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలా ఎవరికి వారే సొంత వ్యూహాలతో బలపడితే ఎన్నికల నాటికి పొత్తులపై నిర్ణయం తీసుకోవచ్చనేది రోడ్ మ్యాప్ అసలు వ్యూహమనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications