రాయలసీమను రతనాల సీమగా మార్చి చూపిస్తాం - పవన్
రాయలసీమను రతనాల సీమగా మార్చి చూపిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అనంతపురంలో జరిగిన 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు. రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టామని.. రాయలసీమకు ఎప్పుడూ కరవు సీజనే ఉంటుందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
అలానే కూటమి ప్రభుత్వానికి పార్టీలు వేరైనా, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందరం కలిసి పనిచేస్తామని పవన్ తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కారణం ప్రజలకు ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలేనని వాటిని పూర్తిగా అమలు చేయడమే తమ ధ్యేయమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆరోగ్య బీమా ఒకటని.. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా కల్పించడం ద్వారా సామాన్య ప్రజలకు కూడా ఆధునిక వైద్య సేవలు పొందుతారని అన్నారు.

మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. పీఎం జన్ మన్ పథకం కింద రూ.1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలను కలిపే రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగులను మోసుకెళ్లే డోలీ మోతల సమస్యకు స్వస్తి పలుకుతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు పవన్ కళ్యాన్ తెలిపారు. ఇది భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తుందని వెల్లడించారు.
యువత భవిష్యత్తుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని విద్య, ఉపాధి అవకాశాలు రాష్ట్రంలోనే కల్పిస్తామన్నారు. ఇకపై పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం కూటమి పార్టీలు కలిసి పనిచేస్తాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications