చిన్నారి రేవతి మరణంపై పవన్ కళ్యాణ్ భావోద్వేగం
చిన్నారి రేవతి మరణం తనను తీవ్రంగా బాధించిందన్నారు జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్.
అమరావతి: చిన్నారి రేవతి మరణం తనను తీవ్రంగా బాధించిందన్నారు జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్. నాలుగేళ్ల క్రితం తాను పోరాట యాత్ర చేస్తున్న సమయంలో.. విశాఖపట్నంలో తనను కలిసిన రేవతి చనిపోవడంతో తనను తీవ్రంగా కలిచివేసిందని జనసేనాని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన రేవతి ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో ఉండేది. నాలుగేళ్ల కిందట నన్ను ఆ చిన్నారి కలిసేనాటికి ఏడెనిమిదేళ్ల వయస్సు ఉందనుకుంటా. అటువంటి ఆరోగ్య స్థితిలో కూడా చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ ఆ చిన్నారి చూపిన మానసిక ధైర్యం నన్ను అబ్బురపరిచింది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కొన్ని భక్తీ గీతాలు కూడా పాడి ఆశ్చర్యపర్చిందన్నారు.

చిన్నారి రేవతికి తాను ఇచ్చిన మూడు చక్రాల బ్యాటరీ సైకిల్‌పై పాఠశాలకు కూడా వెళ్తుందన్నారు పవన్ కళ్యాణ్. భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించాను. అయితే, తనకున్న వ్యాధి కారణంగా ఆ చిన్నారి 12 ఏళ్లకే శివైక్యం చెందడం చాలా బాధాకరం అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తుది శ్వాస విడిచే సమయంలోనూ భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్న వీడియో మనసును కలచివేసిందన్నారు పవన్ కళ్యాణ్. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పుట్టినప్పుడే ఆమె ఎక్కువ కాలం బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పినా.. 12 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్న రేవతి తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications