కాకినాడ ఆలయాలపై పవన్ కీలక ఆదేశాలు..! కాశీబుగ్గ తొక్కిసలాట వేళ ..!
ఏపీలోని కాశీబుగ్గ ఆలయంలో తాజాగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో గుళ్లలో భద్రత, సౌకర్యాల కల్పన మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా భక్తులు భారీగా తరలిచ్చే అవకాశం ఉన్న చోట, పండుగల సమయంలో మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు.
కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే ప్రముఖ శైవ క్షేత్రాలయిన సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాద గయ, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతోపాటు పలు ప్రధాన ఆలయాల్లో ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్య క్షేత్రాలు, దేవాలయాలలో ఏర్పాట్లపై పవన్ దిశానిర్దేశం చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.

కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తక్షణమే అందించాలన్నారు. అక్కడ కూడా రద్దీపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి ఉన్నందున ఆ రోజు, ఆ తర్వాతి రోజు ఉండే రద్దీని అంచనా వేసుకోవాలన్నారు. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోందన్నారు.

కాబట్టి ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల నిర్వహణ ఉండాలన్నారు. క్యూ లైన్లపైనా, ఆలయ పరిసరాల్లోనూ సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు చేయడం, చెత్త పేరుకుపోకుండా పారిశుధ్య నిర్వహణను స్థానిక సంస్థల యంత్రాంగం చేపట్టాలని ఆదేశించారు. అలాగే భక్తుల రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు.












Click it and Unblock the Notifications