ఆ పని చెయ్యకుంటే రాజకీయాలు వదిలేస్తా: పవన్ కళ్యాణ్ భావోద్వేగం!
ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు మాటిచ్చారు. ఇప్పటికే ఉప్పాడ కొణపాక మధ్య తీర రక్షణ పనులు ప్రారంభించినట్టు పేర్కొన్న ఆయన 323 కోట్ల రూపాయలతో ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని వెల్లడించారు. ఉప్పాడ లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యల పైన మాట్లాడారు.
చేపల వేటపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలకు పవన్ హామీ
7వేల 193 మంది మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి అని, వారికి తాను తోడుగా ఉంటానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. పరిశ్రమల కాలుష్యం వల్ల ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులను ప్రస్తావించిన ఆయన, మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానన్నారు.

ఆ పరిశ్రమల కాలుష్యంపైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
దివిస్, అరబిందో వంటి కంపెనీల నుండి కాలుష్యం వస్తుందని మత్స్యకారులు చెప్పిన సమస్యల పైన ప్రస్తావించిన ఆయన పరిశ్రమలు అవసరమే అయినప్పటికీ వాటి వల్ల తలెత్తే సమస్యలను సరిదిద్దడం తప్పనిసరి అని పేర్కొన్నారు. పరిశ్రమలు వ్యర్ధాలను శుద్ధి చేయకుండా వదిలేయడం ప్రధాన సమస్యగా మారిందని గుర్తించారు. ఈ కంపెనీలను 2005లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
సముద్రంలోకి వెళ్లి స్వయంగా కాలుష్యాన్ని పరిశీలిస్తా
కాలుష్య సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మూడు రోజుల్లో పిఠాపురం వస్తానని, పడవలో వెళ్లి సముద్రంలో ఉన్న కాలుష్యాన్ని స్వయంగా పరిశీలిస్తానని ఆయన తెలిపారు. పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వాలని ఆయన వారిని కోరారు. అమీనాబాద్ హార్బర్ డిజైన్ లో లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
వంద రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తా
ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు ఈనెల 14వ తేదీన కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఉప్పాడ తీర ప్రాంత గోడ నిర్మాణానికి సంబంధించిన సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేలా మాట్లాడుతాను అన్నారు. వందరోజుల సమయం ఇస్తే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తానని పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు తెలిపారు.
మీరు తిడితే నేను పడతానన్న పవన్ కళ్యాణ్
మత్స్యకారులకు న్యాయం చేయలేకపోతే తాను రాజకీయాలు వదిలేస్తానని చాలా ఉద్వేగంగా పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడారు. న్యాయం చేస్తామని చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల ఉచ్చులో పడవద్దని పవన్ కళ్యాణ్ మత్స్యకారులను విజ్ఞప్తి చేశారు మీరు తిడితే నేను పడతాను నా భుజం మీద దెబ్బ కొడితే పడతాను అంటూ తాను వారి కోసమే ఉంటానని చిత్తశుద్ధిని తెలియజేశారు. మత్స్యకారులకు సంపూర్ణ న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి మాటిచ్చారు.












Click it and Unblock the Notifications