పవన్: కాంగ్రెసు హఠావో, బాబు సహా ఎవరితోనైనా సై

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు నోవాటెల్‌కు చేరుకున్నారు. మెగా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం స్థాయిలో పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ ప్రకటన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికకు ఇరువైపులా రెండేసి ఎల్ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు 7 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వేదిక మీదికి చేరుకున్నారు. తెల్ల ప్యాంట్, బూడిద రంగు కుర్తా వేసుకుని ఆయన వేదికి మీదికి చేరుకున్నారు. ఆయనను వేదిక మీద చూడగానే అబిమానులు కేరింతలు కొట్టారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/exEDN11RxY8?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

ఇది సామాన్యుడి సేన, ప్రతి ఒక్కరిసి సేన అనే నినాదం తెరలపై కనిపిస్తుంది. దాంతో పాటు ఇది మన సేన, ఇది జనసేన అనే నినాదం కూడా తెరలపై కనిపిస్తుంది. నోవాటెల్ వద్ద పాసులు లేనివారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మెయిన్ గేట్ వద్ద గందరగోళం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో అభిమానులు పరుగులు తీశారు. చెప్పులను వదిలేసి వారు పరుగెత్తారు.

వేదిక మీదికి చేరుకుంటూనే ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, గతుకుల దారి, గుండెల నిండా ధైర్యం ఉందని ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చిన్ననాటి నుంచి ఎలాంటి పరిస్థితి వచ్చినా బాలగంగాధర్ తిలక్ రాసిన ఆ పద్యాన్ని నెమరేసుకుంటానని ఆయన అన్నారు. దౌర్జన్యాన్ని, అవినీతిని అరికట్టడానికి ముందుకు సాగుతానని ఆయన అన్నారు.

పరికితనంతో నీ బాంచెన్ కాల్మోక్తా అనే పిరికిపందను కాదు, ఢిల్లీలో ఉన్నవారిని కాల్మొక్తా అంటే మన రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తెచ్చారని ఆయన అన్నారు. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేశానని, అన్నయ్య పార్టికీ ఎదురుగా నిలబడాల్సి రావడం దురదృష్టకరమని, తండ్రి లాంటి అన్నయ్యను తాను ఎదిరించలేనని, అలాంటి పరిస్థితిని ఢిల్లీలో కాంగ్రెసువాళ్లు కల్పించారని ఆయన అన్నారు. గొప్పగా బతకాలంటే సాహసాలు చేయాల్సి వస్తుందని అన్నారు. తాను బానిసను కాదని ఆయన చెప్పారు.

ఐదేళ్ల క్రితం గుంటూరులో రాజకీయాలు మాట్లాడానని, ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితి మీద గానీ, రాజకీయాల గురించి గానీ మాట్లాడలేదని, దాన్ని దేవుడికే వదిలేశానని ఆయన అన్నారు. రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని, ఎంపీగా గెలవాలని లేదు, మంత్రినీ ముఖ్యమంత్రిని కావాలని లేదని, ఇవన్నీ తనకు తుచ్ఛమని ఆయన అన్నారు.

నా తెలంగాణ, మన తెలంగాణ, పోరు తెలంగాణ అని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయిన పరిస్థితిని చూశారని ఆయన అన్నారు. జనసేన పార్టీ పెట్టానని ఆయన అన్నారు. అందరిలాగా బతకాలని అనుకున్నానని, కానీ సమస్యలు తన వద్దకే వచ్చాయని ఆయన అన్నారు.

ఈ నెల 2వ తేదీన రాజకీయాల గురించి మాట్లాడుతానని ప్రకటన విడుదల చేయాలని చెప్పానని ఆయన గుర్తు చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వస్తున్నా అని భరిస్తామని ఆయన అన్నారు. విమర్శలు ఎలా ప్రారంభమయ్యాయంటే ఇప్పుడెందుకు వస్తున్నారని, ఇప్పుడేం చేస్తారని అంటున్నారని ఆయన అన్నారు.

కెసిఆర్‌పై సెటైర్లు

తాను దిగ్విజయ్ సింగ్ ను అడగాలని అనుకున్నానని, మీకు నేను ఎలా కనిపిస్తున్నానని అడగాలని అనుకున్నానని ఆయన అన్నారు. దిగ్విజయ్ సింగ్‌ను ఆయన ఢిల్లీ పవిత్రాత్మగా అభివర్ణించారు. కెసిఆర్‌పై కూడా ఆయన దుమ్మెత్తి పోశారు. నువ్వు నన్ను చెప్పనీరాదే అని కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. క్షమాపణ చెప్పి పార్టీ పెట్టాలని అన్న కల్వకుంట్ల కవితపై ఆయన విరుచుకుపడ్డారు. నా తెలంగాణ గురించి నువ్వు అనేదేమిటని ఆయన అడిగారు. కెసిఆర్ తిడితే తాను పడతానని ఆయన అన్నారు.

రాజకీయ నాయకులు తనను తిడితే పైకి వద్దామని అనుకుంటున్నారా అని ఆడిగారు. రెండు నెలల ఎన్నికల ముందు ఇలా వచ్చి భయపడేవాడినైతే నిలబడగలిగేవాడినా అని అడిగారు. పిరికితనమంటే తనకు చిరాకు అని ఆయన అన్నారు. చచ్చిపోవడానికైనా సిద్ధపడుతానని ఆయన అన్నారు.

పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిందని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావాలని అనుకున్న తర్వాత అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దుర్మార్గ రాజకీయాల విషయంలో గుండెల్లో పెట్టుకునే అన్నయ్యను చూసిన తర్వాత ఆగిపోవాలా అనుకున్నానని ఆయన అన్నారు. అన్నయ్యను చూసి ఆగిపోవాలని అనుకున్నానని ఆయన అన్నారు. నాలుగు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలుసుకున్నానని, సమాజం ముఖ్యమా, వ్యక్తిగతం ముఖ్యమా అని ఆలోచించుకున్నానని, అప్పుడు సమాజం ముఖ్యమని అనుకున్నానని ఆయన అన్నారు.

రాజకీయాలు అవసరమా, ఏవో సినిమాలు తీసుకుంటూ ఉండకుండా అనుకున్నానని, తన ఇద్దరు కూతుళ్లను చూశానని, పరికితనంతో రాజకీయం చేయలేమని అర్థమైందని, తాను వదిలేస్తే వారు ఎలా ఉంటారని అనుకున్నానని, నిస్వార్థంగా రాజకీయాలు చేయాలంటే ప్రాణాలకు తెగించి పోరాడాలని ఆయన అన్నారు. సమాజం ముఖ్యమని అనుకున్నప్పుడు కుటుంబం చిన్నదిగా కనిపించిందని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు శత్రువులు లేరని, కోపం కూడా రాదని, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేదని, తన మిత్రులు చాలా మంది ఉన్నారని, వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక్కరని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్‌కు ఇష్టం లేదని ఆయన అన్నారు.

ప్రజలకు తెలియని మిత్రుడు ఉన్నారని, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆపలేదని, అది ఇప్పుడు జనసేన అయిందని ఆయన అన్నారు. జమ్మికుంట నుంచి తన మిత్రుడు ఒకతను రాజు రవితేజ ఉన్నాడని, తాను తక్కువ కాకుండా ఆలోచిస్తూ వచ్చామని, పార్టీ పెట్టాలనే ఆలోచనైతే లేదని ఆయన అన్నారు. పెద్ద రాజకీయ వేత్తలు తన వెంట లేరని ఆయన అన్నారు. సినిమాల మీద ఆసక్తి లేదని, ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని, కొత్త సినిమాలు తీయడం లేదని, దీనికి తనను నిందించవద్దని, ఢిల్లీ పెద్దలను నిందించాలని ఆయన అన్నారు.

పార్టీ పెడితే పెట్టనీ గానీ దాన్ని కాంగ్రెసులో కలపాలని దిగ్విజయ్ సింగ్ అన్నారని, అదేదో గంగానది అయినట్లు ఆయన మాట్లాడారని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు ఇంట్లోవారి కన్నా దేశం, సమాజం ముఖ్యమని ఆయన అన్నారు. 16 ఏళ్లకు సచిన్ టెండూల్కర్‌ సిక్సర్లు కొడుతున్నాడని, నువ్వేమిటి పనీపాటా లేకుండా తిరుగుతున్నావని అనేవారని, ఆడుకుందామంటే మైదానాలు లేవని ఆయన అన్నారు. తాను పార్టీ పెడుతున్నట్లు నాలుగు రోజుల క్రితమే తన కుటుంబ సభ్యులకు తెలుసునని ఆయన అన్నారు.

తన మీద తనకు కోపం వచ్చేదని, ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని, నిరాశానిస్పృహల వల్ల అలా అనిపించిందని ఆయన అన్నారు. ప్రతి పార్టీలోనూ వ్యక్తిగతంగా తనకు తెలిసిన నాయకులున్నారని, సన్నిహితంగా మెలిగేవారున్నారని, కానీ సైద్ధాంతికంగా విభేదిస్తన్నానని, వాళ్ల ఆలోచన సరళికీ తన ఆలోచనా సరళికీ కుదరదని ఆయన అన్నారు. రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ సమస్యలను పరిష్కరించడానికే గానీ జఠిలం చేయడానికి కాదని ఆయన అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి సామాజికస్పృహ ఉందని చెప్పారు.

తెలంగాణకు వ్యతిరేకం కాదు

తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, సీమాంధ్ర ఆత్మగౌరవం దెబ్బ తింటే కూడా ఊరుకోనని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తింటే ఊరుకోనని ఆయన అన్నారు.విభజన తీరు తనకు నచ్చలేదని ఆయన అన్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వెంకయ్యనాయుడు జైరాం రమేష్‌ను నిలదీయడం తనకు నచ్చిందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తాడట, దౌర్భాగ్యం కాకుపోతే ఏమిటని అన్నారని, విశిష్టమైన రాజకీయ నాయకులు మీరు అని, పార్లమెంటును ఎంత అసహ్యంగా తీసుకువచ్చారో చూశానని, గౌరవంగా తేవాల్సిన తెలంగాణను ఎలా తెచ్చారో అందరూ చూశారని ఆయన అన్నారు

భగత్సింగ్ నీవు చచ్చిపోలేదని, తాను ఉన్నానని ఆయన అన్నారు. భగత్సింగ్ జీవితం తనకు స్ఫూర్తి అని ఆయన అన్నారు. తెలంగాణలో తనకు నచ్చిన మంచి శాసనసభ్యుడు జగ్గారెడ్డి అని ఆయన చెప్పుకున్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉఁదామని చెప్పినవాడు జగ్గారెడ్డి అని, ఆలాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఉంటే స్వీట్లు పంచుకునేవారమని ఆయన అన్నారు. తనకు విహెచ్ అన్నా ఇష్టమని, వెటకారం లేదని, నిజంగా చెబుతున్నానని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని, తామున్నామని చెప్పారని పవన్ కళ్యాన్ అన్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని విహెచ్ అన్నారని, రాహుల్ గాంధీ ఒక్క పెళ్లయినా చేసుకోలేదని ఆయన అన్నారు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదని చెప్పారు గానీ బ్రహ్మచారి అని చెప్పలేదని, అది వేరే విషయమని ఆయన అన్నారు.

మూడుసార్లు పెళ్లి చేసుకుంటే రాజకీయాలకు పనికి రాడని అంటున్నారని, ఒకే ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగేవారు రాజకీయాలు చేయవచ్చా అని ఆయన అన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తే, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వద్రా వ్యక్తిగత జీవితం గురించి, రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితాన్ని, ప్రతి నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీస్తానని ఆయన అన్నారు. మీకు స్పైస్ కావాలేమో, అలా చెప్పదలిస్తే బోలెడంత మంది ఉన్నారని ఆయన అన్నారు.

ఆ పార్టీకీ, ఏ రంగానికీ చెందినవారైనా సరే, తన వ్యక్తిగత జీవితాన్ని మాట్లాడితే మీ వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీస్తానని ఆయన అన్నారు. తనకు పత్రికలు లేవని, అభిమానులున్నారని, యూట్యూబ్ ఉందని, సోషల్ నెట్‌వర్కింగ్ ఉందని ఆయన అన్నారు. తాను వ్యక్తిగత జీవితాన్ని విమర్శించనని, ప్రజాజీవితాన్ని ఇబ్బంది పెట్టకుండా మీరేమైనా చేసుకోండని ఆయన అన్నారు ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగేవి వినిపించవు, కనిపించవు అని ఆయన అన్నారు. వాటి గురించి మాట్లాడవద్దని ఆయన అన్నారు.

వ్యక్తిగతంగా ఏవరి మీదా తాను మాట్లాడబోనని, అది తన సంస్కారమని, మీరు మాట్లాడే ముందు మీ ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని ఆయన అన్నారు. జన జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆమె కల్వకుంట్ల చంద్రశేఖర రావు అమ్మాయి అని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్లాలని అన్నారని, తాను ప్రేమించే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తానా, లేదా అనేది తన వ్యక్తిగత విషయమని, అది కవితకు గానీ, ఆమె కుటుంబానికి గానీ సంబంధం లేదని ఆయన అన్నారు. కవిత తనకు చెల్లెలిలాంటిదని, తాను కవిత బాధనూ వేదననూ అన్నయ్యగా అర్థం చేసుకున్నానని, కవిత అన్నయ్య కెటి రామారావు భావావేశాన్ని అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు.

తెలంగాణకు చెందిన ఓ ప్రజా సంఘం నాయకుడు తనతో చెప్పారని, తాను దాచుకోలేనని, బయటకు తెస్తానని ఆయన అన్నారు తెలంగాణ జాగృతి సంస్థ పెట్టి చాలా విరాళాలు సేకరించారని చెప్పారని, అమెరికాలోని తన మిత్రులు కూడా చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులకు ఆ డబ్బుల వ్యవహారం చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. తనను తిట్టినా, తన మీద ఎలాంటి రాతలు రాసినా వ్యక్తిగతంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సమాజానికి ఏదో చేయగలనని అనుకున్నానని ఆయన అన్నారు. ఒక్క ఆడపిల్లను నలుగురు పాశివికంగా రేప్ చేస్తే గానీ మీరు మాట్లడరా అని రాజకీయ నాయకులను ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో రాజకీయ నాయకులు అత్యంత ఘోరంగా మాట్లాడుతారని ఆయన అన్నారు. పార్లమెంటేరియన్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన ఈ రకంగా జరగడానికి కారణమేమిటని ఆయన అడిగారు. గోటితో పోయేదాన్ని గొడ్డలితో చేశారని, భారత సమాజాన్ని అర్థం చేసుకునే నాయకులు లేరని ఆయన అన్నారు. ఒక సమస్యను పరిష్కరించకపోతే సంక్షోభంగా మారుతుందని, దాన్ని సరిగా పరిష్కరించకపోతే విధ్వంసానికి దారి తీస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన ముఖ్యులు సరిగా పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆయన అన్నారు. సినిమాల్లో నటించే తనకే బాధగా అనిపిస్తుంటే, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న మీకు తెలియదా అని ఆయన అన్నారు. తెరాస గానీ, తెలంగాణ సంఘాలు గానీ లేవనెత్తిన సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. కెసిఆర్‌ను తాను తప్పు పట్టలేనని, తాను సీమాంధ్రవారికి ఇందుకు క్షమాపణ చెబుతానని ఆయన అన్నారు. బాధ్యత వహించాల్సింది అన్ని పార్టీలు, రాజకీయ నాయకులు అందరూ అని, వారు తెలంగాణవారైనా సీమాంధ్రవారైనా బాధ్యులని ఆయన అన్నారు.

ఇటువంటి పరిస్థితి కల్పించిన రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మాట్లాడుకుంటారని, మనలాంటి వారే ఇబ్బంది పడుతారని ఆయన అన్నారు. తాను ప్రతి మాటా బాధ్యతతో మాట్లాడుతున్నానని, రెచ్చగొట్టడానికి మాట్లాడడం లేదని ఆయన అన్నారు. తన తల్లిదండ్రులు తమ కులాన్ని ఏనాడూ ప్రస్తావించలేదని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టే సమయంలో ఓ పెద్దాయన తన కార్యాలయానికి వచ్చి తిట్టారని, తెలంగాణ పట్ల దశాబ్దాలుగా చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని తనవైపు చూపించారని, తనకు నవ్వు వస్తోందని, ఆంధ్రా తెలివితేటలు అన్నాడని ఆయన అన్నారు. తెలంగాణ, ముస్లిం మిత్రులనిు చెప్పడం సరి కాదని, అయితే కాంగ్రెసు వాళ్లు కల్పించిన పరిస్థితి వల్ల అలా చెప్పాల్సి వస్తోందని ఆయన అన్నారు. అర్జెంటీనా వీరుడు చెగువేరాను తన గుండెల్లో పెట్టుకోవచ్చు గానీ కొమురం భీమ్ పెట్టుకోవద్దని అంటే బాధనిపించిందని, ఆంధ్రావాడిని కాబట్టి వ్యతిరేకించారని ఆయన అన్నారు. తీన్‌మార్ సినిమా సమయంలో ఇబ్బందులు వచ్చాయని, తెరాస నాయకుడు శ్రవణ్‌ను పరిచమయ్యారని, శ్రవణ్‌కు కూడా తాను ఆంధ్రోడినయ్యానని ఆయన అన్నారు.

తాట తీస్తా..

ఎక్కడికి వెళ్లినా ప్రశాంతంగా షూటింగ్‌లు చేసుకోవచ్చునని, తెలంగాణలో ఇబ్బందులు వచ్చాయని, తెలంగాణ నాయకులు రెచ్చగొట్టడం వల్ల జరిగిందని ఆయన అన్నారు. తనకు నిజమైన తెలంగాణ ప్రేమ ఉందని ఆయన అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయని, ఆ సయమంలో ఓ నాయకుడు తన వద్దకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టాలని అన్నారని, చంద్రబాబు మీద నమ్మకం లేదని, జగన్ జైలులో ఉన్నాడని చెప్పారని, సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై, మంత్రి పదవిపై ఆశ లేదని ఆయన అన్నారు. తాను ఒక్కడినే కన్నీళ్లు పెడుతున్నానని, ఆంధ్రోడంటే బాధేస్తోందని, తాను భారతీయుడినని, దాన్ని అర్థం చేసుకోండని అడుగుతున్నానని ఆయన అన్నారు. కాపులెవరూ పవన్ కళ్యాణ్‌ను అంగీకరించడం లేదని అంటున్నారని, వారెవరు చెప్పడానికి ఆయన అన్నారు. తనకు కులం, మతం, ప్రాంతం లేదని, తాను భారతీయుడినని ఆయన అన్నారు. సనాతన ధర్మంతో నడిచే దేశమని, రాజకీయ నాయకుల ఆటలు సాగవని ఆయన అన్నారు. ప్రజలు విడిపోలేరని ఆయన అన్నారు. ప్రజలను విడగొట్టే తుచ్ఛమైన రాజకీయాలు చేస్తే తాట తీస్తానని ఆయన హెచ్చరించారు.

గద్దర్ పాటకు చొక్కాలు చించుకున్నాం

భారతదేశంలో రక్తపాతం సృష్టించాలనుకుంటే నాశనమై పోతారని, ఇది సనాతన ధర్మం కారణంగా ఆ పని చేయలేరని ఆయన అన్నారు. బమ్మెర పోతన రాసిన పద్యాన్ని చదివి వినిపించారు. నాలుక చీరేస్తా, బొక్కలిరగ కొడుతా వంటి మాటలు తెలంగాణ కాదని ఆయన అన్నారు. కంచ ఐలయ్య మాటల్లో చెప్పాలంటే ఫ్యూడలిస్టు వ్యవస్థకి ఆ మాటలు నిదర్శనమని, అది ఫ్యూడలిస్టిక్ దురహంకారమని ఆయన అన్నారు. గద్దర్ పాడిన సీమాంధ్రలో పాట పాడితే తాను గంతులేశానని ఆయన అన్నారు. బండెనక బండి కట్టి, జమ్ జంబలబరీ అని గద్దర్ పాడితే చొక్కా చించుకున్నామని, అది సీమాంధ్రలందరికీ ఉన్న గౌరవమని ఆయన అన్నారు. తెలంగాణ ఆటా పాటా తనను ఇక్కడ నిలబెట్టిందని ఆయన అన్నారు.

గద్దర్ మీద దాడి జరిగినప్పుడు అక్కున చేర్చుకుంది సీమాంధ్రదని ఆయన అన్నారు. మృత్యువును జయించిన గద్దర్ ను అడిగితే సీమాంధ్ర ప్రేమ ఏమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. భావం ముఖ్యమా, భాష ముఖ్యమా అని అడిగారు. ప్రతి చోటా గొప్పవాళ్లు పుడుతూనే ఉంటారని, గొడవలు పెట్టవద్దని ఆయన అన్నారు. ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలంలో గొప్పవాళ్లు పుడుతూనే ఉంటారని, దాన్ని రాజకీయ చేయవద్దని ఆయన అన్నారు. విభజజన జరిగిన తర్వాత కూడా సీమాంధ్రవారిని బూతులు తిడితే బంగారు తెలంగాణ రాదని ఆయన అన్నారు. గొంతు చించుకుని, బట్టబయలు చేసుుని పరిస్థితిని తెచ్చింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వాలని అనుకుటే అంత మంది బలిదానాలు జరగాలా అని ఆయన అడిగారు. తెలంగాణలో 2009లో ఇవ్వాలని అనుకున్నప్పుడు రాష్ట్ర రాజకీయ నాయకులతో మాట్లాడి అందంగా తెచ్చి ఉండవచ్చునని, అప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట్లాడి తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంత మంది చనిపోయి ఉండేవారు కారని ఆయన అన్నారు.

అభయ హస్తం అంటే వెన్నుపోటు పొడిచే హస్తం లాగా తయారైందని ఆయన అన్నారు. సీమాంధ్రకు రాజధాని లేదని ఆయన అన్నారు. అప్పుల బారి నుంచి దేశాన్ని కాపాడింది తెలంగాణ వ్యక్తి పివి నర్సింహరావు అని, ఆయన చనిపోతే ఎఐసిసి కార్యాలయంలో భౌతిక కాయాన్ని ఉంచలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అది కాంగ్రెసు వాళ్లకు పివి మీద ఉన్నప్రేమ అని ఆయన అన్నారు. ప్రధాని కావాలని రాహుల్ గాంధీకి ఉంటే ఇందిరా గాంధీలాగా వ్యవహరించాలని, తమిళనాడులో ఉద్యమం జరిగితే ఇందిరాగా వెనక్కి హిందీని తీసుకున్నారని ఆయన అన్నారు. విభజన రాజకీయాలకు, అవకాశవాద రాజకీయాలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం జైరాం రమేష్ అని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా విభజనకు వ్యతిరేకమని, కానీ ఇచ్చేశామని సీమాంధ్రలో అన్నారని, తెలంగాణలో మరో మాట మాట్లాడరని ఆయన అన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రి అని, గౌరవం ఇవ్వాలని ఆయన జైరాం రమేష్‌ను హెచ్చరించారు. రెండు ప్రాంతాలకు చెందినవారు కాంగ్రెసు అధిష్టానంలో లేరని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాలవారు ఉంటే బాధను తగ్గించడానికి చూస్తారని, కానీ అలా లేరని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం కోటరినీ ఎండగట్టాలని ఆయన అన్నారు. మన ముఖాలన్నీ పివి నర్సింహరావు ముఖంలా కనిపిస్తున్నాయేమో, అందుకే అంత మంది చచ్చిపోయినా పట్టించుకోలేదని ఆయన అన్నారు

తాను ఎవరినీ వదిలిపెట్టదలుచుకోలేదని, సోనియాను కూడా అంటానని ఆయన అన్నారు. సోనియా, రాహుల్ విజయనగరం వెళ్లి, బొత్స సత్యనారాయణ పార్లమెంటరీ నియోజకవర్గానికి వెళ్లి మాట్లాడాలని, అప్పుడు పరిస్థితులు ఏమిటో తెలుస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానని, వదిలిపెట్టబోనని ఆయన అన్నారు. జాతీయ సమగ్రతను చెడగొట్టినట్లు తెలిస్తే దేశం కోసం చచ్చిపోయే మొదటివాడిని తానే అవుతానని ఆయన అన్నారు. దేశం కోసం, సమాజం కోసం చనిపోవడానికి ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ఉందామని చెప్పడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఒకే చట్టం మజ్లీస్ నాయకులకు ఎంత బలంగా పనిచేసింది, ఇతర నాయకులు తిడుతూ జాతీయ భద్రతకు భంగం కలిగిస్తే ఎందుకు చేయలేదని ఆయన అన్నారు. ఎవరి ప్రాంతాల అబివృద్ధిని వారు కోరుకోవాలని ఆయన అన్నారు

చంద్రబాబు చాలా మంచి వ్యక్తి

చంద్రబాబు మంచి వ్యక్తి అని ఆయన అన్నారు. జనసేన పార్టీ పెట్టడానికి కారణం చట్టం అందరికీ ఒకే విధంగా పనిచేయాలని చెప్పడానికి ఆయన అన్నారు. బ్లాక్ మార్కెట్ వ్యవస్థను నిర్మూలిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి తనకు తెలియదని ఆయన అన్నారు. పోటీ చేస్తానో లేదో ఆలోచించలేదని ఆయన అన్నారు. భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్ పార్లమెంటుకు వెళ్లలేదని, పార్లమెంటు ఓ సాధనం మాత్రమేనని ఆయన అన్నారు. అన్నీ ఒక్కడికే కావాలని కోరుకోవడం వల్లనే వైషమ్యాలు వస్తాయని ఆయన అన్నారు. తనకు రాజకీయ గుండాలు లేరని, పది రాజకీయ గుండాల కన్నా ఒక్క సైద్ధాంతిక బలం ఒక్కరు కారని ఆయన అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీలాగా కాదు..

తాను ఆమ్ ఆద్మీ పార్టీలాగా రావడం లేదని, అసెంబ్లీలో కూర్చుని గందరగోళం కోసం రావడం లేదని ఆయన అన్నారు. పోటీ చేస్తామని, అయితే ఎప్పుడో చెప్పలేనని, పార్టీ నిర్మాణం లేదని, అటు నుంచి ఇటు దుమికే వాళ్లు తన పార్టీలో ఉండరని ఆయన అన్నారు. తెరాస నాయకుల మీద తనకు గౌరవం ఉందని, వారు ఓ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకుల మీద లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఓ రకంగా, చనిపోయిన తర్వాత మరో రకంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడినవారే చనిపోయిన తర్వాత విమర్శించారని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలకు సుస్థిరత సాధించాలనే దానిపైనే తన మనసు ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే సుస్థిర పాలన వస్తుందనేది ఆలోచిస్తున్నానని ఆయన అన్నారు.

కాంగ్రెసుతో తప్ప ఏ పార్టీతోనైనా చేతులు కలుపుతా

కాంగ్రెసు పార్టీకి తప్ప ఏ పార్టీతోనైనా తాను చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. చంద్రబాబుతో కూడా మాట్లాడుతానని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలు తనకు కొన్ని ఉన్నాయని, వాటిని అంగీకరించేవారితో కలుస్తానని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం చర్యకు తాము తీవ్రంగా బాధపడ్డామని జనసేన తరఫున చెప్పదలుచుకున్నానని ఆయన అన్నారు. కాంగ్రెసు హఠావో దేశ్ బచావో అనే నినాదం ఇచ్చారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+