అది.. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం కాదు- తేల్చేసిన పవన్
ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మలి విడత వారాహి బస్సు యాత్ర ఆదివారం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఏలూరులో ఆయన పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నాలుగు రోజుల ఆయన ఈ జిల్లాలో పర్యటిస్తారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లి గూడెంలల్లో పర్యటిస్తారు పవన్.
ఈ పర్యటన ఏర్పాట్లపై ఇవ్వాళ గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి సత్య, చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయాలను కూడా తీసుకోలేదని అన్నారు. పొత్తుల గురించి ఆలోచన చేయడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలా? లేక కలిసి వెళ్లాలా? అనేది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం కాదని అన్నారు.
మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం చేసిన తరువాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా పని చేస్తే అధికారం అనేది తనంతట తానే వస్తుందని వ్యాఖ్యానించారు. దీనికి అనుగుణంగా నాయకులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం అంతా వారాహి యాత్రను విజయవంతం చేయడంపై ఉందని, దీని ద్వారా మండలం, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవచ్చని అన్నారు. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం బలంగా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ బలంగా నిర్మితమౌతే- అధికారాన్ని అందుకోవడం సులభమేనని, దీనికి పొత్తుల అవసరం ఉందా? లేదా? అనే విషయంతో ప్రమేయం ఉండదని చెప్పారు.












Click it and Unblock the Notifications