'పవన్ టిడిపికి వ్యతిరేకంకాదు', చెప్పుతో కొట్టింది తెలియదా, వైసిపిలోకి ఉండవల్లి: సోమిరెడ్డి
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి గురువారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
రాజధాని నిర్మాణానికి భూసేకరణ అవసరం లేదనుకుంటున్నారన్నారు. వనజాక్షి పైన దాడి ఘటన పైన త్వరలో నివేదిక వస్తుంది చెప్పారు. రాజధాని భూసమీకరణ వ్యవహారం ప్రత్యేక కమిటీ చూసుకుంటుందని చెప్పారు.

హోదా, ప్యాకేజీ అడిగారు: సోమిరెడ్డి
ఏపీకి జరిగిన అన్యాయం పైన కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టదల్చుకుంటే, తొలుత కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల పైన పెట్టాలని టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరితోను రాజీపడలేదన్నారు.
చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్యాకేజీని అడిగారని చెప్పారు. ప్యాకేజీగా రూ.2.25 లక్షల కోట్లు అడిగారన్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఆయన ఎప్పుడు జగన్ పార్టీలో చేరుతారో చెప్పాలన్నారు. ఉండవల్లి నోరును అదుపులో పెట్టుకోవాలన్నారు. విభజన సమయంలో జనం కాంగ్రెస్ పార్టీని చెప్పులతో కొట్టిన విషయం ఉండవల్లికి తెలియదా అన్నారు.
రాష్ట్ర రక్షాబందన్ చేయాలని బొత్స పిలుపు
ఈ నెల 29న తమ పార్టీ తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ గురువారం కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే బంద్ చేపట్టామని, పార్టీ బలోపేతం కోసం తలపెట్టిన బంద్ కాదన్నారు.
ఈ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ బంద్‌ను రాష్ట్రానికి రక్షా బందన్ దినోత్సవంగా చేయాలని బొత్స కోరారు. తమ బంద్‌కు వామపక్షాలు మద్దతు తెలిపాయన్నారు. ఆ రోజు రాఖీ పౌర్ణమి ఉన్నందున బంద్ పైన పునరాలోచించుకోవాలని పలువురు కోరినప్పటికీ వైసీపీ నిర్ణయాన్ని మార్చుకోలేదు.












Click it and Unblock the Notifications