మీరెంత.. సాక్షిలో పిచ్చిరాతలు, బాధ్యత నాదే: పవన్
ఏలూరు/రాజమండ్రి: తాను చెప్పిన పార్టీకి ఓటేయాలని, ఆ పార్టీలు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఆ బాధ్యతను తాను తీసుకుంటానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో అన్ని అబద్దాలేనని, పిచ్చిరాతలేనని ఆరోపించారు. కొందరిపై తాను విమర్శలు చేస్తున్నానని రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వాటికి బెదిరేది లేదన్నారు.
తుమ్మితే పోయే ప్రాణాలంటే తనకు లెక్క లేదన్నారు. తనపై ఎవరైనా దాడులు చేస్తే.. తుపాకులు ఉండవని.. భరతమాతకు జై అంటూ సమూహంగా నడుచుకువెళ్తానని, ఆ దుమ్ముధూళికి భస్మమైపోతారని హెచ్చరించారు. జగన్ వంటి నేత తమ ముఖ్యమంత్రి అవుతారనే భయంతోనే విభజన ఉద్యమం ఉధృతమైందన్నారు. ప్రశ్నించినందుకే కెసిఆర్ తనను తిడుతున్నారని మరి తెలంగాణను దోచేసిన వైయస్ గురించి ఆయన ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

జగన్ అంటే తనకు భయం లేదని పవన్ స్పష్టం చేశారు. జగన్ అంటే భయం లేదు, జగన్ అంటే శత్రుత్వం లేదు, దోపిడీకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నాను, జగన్ దోపిడీ చేసి జైలుకెళ్లాడన్నారు. తాను మాత్రం దోపిడీని ఎదిరించడానికి, సీమాంధ్రను రక్షించడానికి జైలుకు వెళ్లడానికెనా సిద్ధమే అన్నారు. మోడీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడే జగన్.. కెసిఆర్ గురించి ఒక్క ముక్కైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. జగన్‌కు కెసిఆర్ అంటే భయమన్నారు.
జగన్‌ను తాను విమర్శిస్తుండటంతో ఆయన పత్రికలో వ్యతిరేక కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పత్రికలోని పసుపు రంగు చూసినప్పుడు టిడిపి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మంచివారు అనిపిస్తోందని, రాష్ట్రాన్ని కూలగొట్టి, ప్రజలను కొల్లగొట్టి సంపాదించిన డబ్బులతో జగన్ టీవీ, పేపర్ పెట్టారని, అవి తన గురించి పిచ్చి రాతలు రాస్తున్నాయని, మీరెంత.. మీ పేపరెంత అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications