వైసీపీ మైండ్ గేమ్ లో పవన్ చిక్కారా - జనసేనాని తాజా వ్యాఖ్యలతో : పొత్తులపై వాట్ నెక్స్ట్..!!
వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే ప్రసక్తే లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ధీమా వ్యక్తం చేసారు. అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదు అనే వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ కు పవన్ సమాధానం ఇచ్చారు. జనసేన కార్యకర్తలు ఇతరుల పల్లకీలు మోయటానికి సిద్దంగా ఉండంటూ వైసీపీ నేతలు అంటున్నారని..వారికి మా కేడర్ పైన ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. తాను ఏంటో తన పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. వైసీపీ పదే పదే పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేయటం కోసమే తపన పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు మండిపడ్డారు.

వైసీపీ వ్యాఖ్యలకు పవన్ రియాక్ట్ అవ్వటంతో
చంద్రబాబు పల్లకీ మోసేందుకు జనసేన అభిమానులు సిద్దంగా ఉండాలని.. పవన్ చెబుతున్నది అదేనంటూ వ్యాఖ్యానించారు. దీంతో..వైసీపీ నేతల వ్యాఖ్యల పైన పవన్ స్పందించారు. వైసీపీ కోరుకున్న విధంగానే రియాక్ట్ అయినట్లు కనిపిస్తోంది. తాము ఎవరి పల్లకీలు మోయడానికి ఇక్కడ లేమని చెబుతూనే.. ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే వచ్చామని చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీలో చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపించింది. కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు ఇస్తున్న వివరణతో కొత్త చర్చలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ మాత్రం ఒక వైపు టీడీపీ -జనసేన కలిసి పోటీ చేస్తాయనే మైండ్ గేమ్ గేమ్ లో పవన్ చిక్కినట్లు కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

జనసేనలో చర్చ జరగుతోందని చెబుతూ
వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని చెప్పటం ద్వారా జనసేనలోనూ కొందరు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహం తనకు వదిలేయాని పార్టీ నేతలను పవన్ కోరారు. తాను ప్రజలను పల్లకీ ఎక్కించటానికే ఉన్నానని..ఇంకెవరినో కాదని చెప్పటం ద్వారా టీడీపీ అధికారంలోకి రావటానికి తాను సహకరించననే విషక్ష్ం పవన్ పరోక్షంగా చెప్పినట్లుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రతీ నియోజకవర్గంలో తన కళ్లూ - చెవులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎవరూ స్థాయి దాటి మాట్లాడవద్దని సుతిమెత్తగా పవన్ పార్టీ నేతలను హెచ్చరించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని చేసిన వ్యాఖ్యలు సరదాగా చెప్పినవి కాదన్నారు. అదే సమయంలో బీజేపీతో బంధం పైనా పవన్ వ్యాఖ్యానించారు.

బీజేపీని ప్రశ్నించకూడదని లేదంటూనే
బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నామనే కారణంతో..ఏమీ మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం లేదన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ తాజాగా తీర్మానం చేసారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచే ప్రసక్తే లేదని.. గెలవని పార్టీ కోసం పతన పడవద్దంటూ కొందరు అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, పవన్ చెబుతున్న వ్యూహం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ నేతల మైండ్ గేమ్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలకు పవన్ సమాధానం ఇచ్చారని..అదే సమయంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగానే జనసేన నేతల్లోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయనేది పవన్ తన ప్రసంగంలోనే స్ఫష్టం చేసారు.

వ్యూహం తనకు వదిలేయమంటున్న జనసేనాని
దీంతో...పవన్ సింగిల్ పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారా..అలా చేస్తే జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా నివారించే ఛాన్సే లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. టీడీపీతో జత కలిస్తే..ఇప్పుడు పవన్ ఇస్తున్న వివరణకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు కొనసాగింపు అంశం పైనా రెండు పార్టీల్లోనూ డైలమా కొనసాగుతోంది. ఇదే సమయంలో నాలుగు దశాబ్దాల అనుభవమున్న పార్టీ కూడా వైసీపీ దాష్టీకానికి విలవిలలాడుతోందంటూ పవన్ పరోక్షంగా టీడీపీ పరిస్థితిని ప్రస్తావించారు. దీంతో..జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో సారి హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications