పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభం: టీడీపీ నుండి హాజరైన అచ్చెన్నాయుడు: గంటా ఎక్కడ..!
ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. విశాఖ చేరుకున్న పవన్ నేరుగా మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు.అక్కడ విగ్రహానికి పూల దండ వేసి మార్చ్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు..భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు.
ఈ లాంగ్ మార్చ్ పాత జైలు రోడ్డు వద్దకు చేరుకున్న తరువాత జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ మార్చ్ కు టీడీపీ మద్దతు ప్రకటించింది. టీడీపీ నుండి ముగ్గురు మాజీ మంత్రులు హాజరవుతారని చంద్రబాబు ప్రకటించినా..మార్చ్ ప్రారంభమయ్యే సమయానికి టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు..పార్టీ స్థానిక నేతలు పవన్ తో కలిసి అడుగులు వేస్తున్నారు. ఇతర నేతలు సైతం జాయిన్ అవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు.

తెలుగుతల్లి విగ్రహం నుండి ప్రారంభం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా..భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్ మార్చ్ ప్రారంభమైంది. నగరంలోని మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం నుండి ఈ మార్చ్ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున జనసైనికుల పార్టీ జెండాలతో మార్చ్ లో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు సైతం భారీగా హాజరయ్యారు. నాదెండ్ల మనోహర్..అచ్చెన్నాయుడు, స్థానిక జనసేన..టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తున్నారు. అదే సమయంలో..మార్చ్ లో ఇసుక కొరత పై జనసేన పార్టీ నిర్వహిస్తున్న లాంగ్‌మార్చ్‌లో వివిధ రకాల నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు.
ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని, అన్నిరీచ్‌లు తెరిచి ఇసుకను అందుబాటులోకి తీసుకువాలన్న డిమాండ్‌తో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనం కార్మికులను బలితీసుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వం చేసేది ఇసుక వారోత్సవాలు కాదు, వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ వారోత్సవాలు అంటూ పెద్దయెత్తున ప్లకార్డులు ప్రదర్శించారు.

గంటా..అయ్యన్న ఎక్కడ..హాజరు కావటం లేదా
పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి విశాఖలో నిర్వహించే లాంగ్ మార్చ్ కు మద్దతివ్వాలని కోరటంతో టీడీపీ అధినేత చంద్రబాబు అంగీకరించారు. పార్టీ నుండి ముగ్గురు మాజీ మంత్రులు హాజరవుతారని చెప్పారు. గంటా శ్రీనివాస రావు..చింతకాయల అయ్యన్నపాత్రుడు..అచ్చెన్నాయుడు పాల్గొంటారని ప్రకటించారు. వీరితో పాటుగా స్థానిక టీడీపీ నేతలు ఈ మార్చ్ లో పాల్గొనాలని సూచించారు. అయితే, మార్చ్ ప్రరంభ సమయానికి టీడీపీ నుండి అచ్చెన్నాయుడు మాత్రమే హాజరయ్యారు. ఇదే విశాఖ జిల్లాకు చెందిన గంటా..అయ్యన్న పాత్రుడు మాత్రం ఇంకా పవన్ తో జత కలవలేదు.
చంద్రబాబు ముగ్గురు పేర్లు ప్రకటించిన సమయం నుండి గంటా హాజరు పైన అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. దీంతో..జనసేన నేతలు సైతం ఈ కార్యక్రమానికి రావాలంటూ గంటాను సైతం ఆహ్వానించారు. దీంతో..ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నా..ఇంకా సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి.

ఆంధ్రయూనివర్శిటీ ఇంజినీరింగ్ గేట్ వద్ద ఉద్రిక్తత
అంతకు ముందు పవన్ మార్చ్ ప్రారంభించే ప్రాంతానికి చేరుకొనే సమయంలో కొద్ది పాటి ఉద్రిక్తత ఏర్పడింది. పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కు యూ విద్యార్థి జేఏసీ మద్దతు తెలిపింది. దీంతో లాంగ్ మార్చ్‌కు వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏయూ వీసీ వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏయూ వీసీకి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. అయితే, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీయకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ పైన ఇప్పటి వరకు వైసీపీ మంత్రులు..నేతలు చేస్తున్న విమర్శలకు ఏ రకంగా సమాధానం చెబుతారనేది ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications