Chandrababu-Pawan Kalyan: చంద్రబాబును కలిసిన పవన్-రేషన్ నుంచి పుష్ప వరకూ చర్చ ?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఉండవల్లి నివాసానికి వెళ్లి కలిశారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇరువురు నేతలు కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పవన్ ఢిల్లీ, కాకినాడ పోర్టు పర్యటనలు, రేపటి కేబినెట్ భేటీలో చర్చించే అంశాలు ఇలా పలు విషయాలపై ఇద్దరూ చర్చిస్తున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినప్పటికీ.. పుష్ప సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశం కూడా వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర నేతల్ని కలిసి వచ్చారు. అలాగే కాకినాడ పోర్టుకు వెళ్లి రేషన్ బియ్యం అక్రమ రవాణాను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులపై నిప్పులు చెరిగారు. దీంతో పాటు కాకినాడ పోర్టులో పట్టుకున్న దక్షిణాఫ్రికా షిప్ స్టెల్లా ఎల్ 1 భవిష్యత్తుపైనా వీరిద్దరూ చర్చించారు. కాకినాడ పోర్టులో జరుగుతన్న అక్రమాల చిట్టా, అధికారుల తీరుపైనా చంద్రబాబుకు పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో కాకినాడ పోర్టులో పట్టుకున్న నౌకపై తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ టూర్ లో కేంద్రం ముందు తాను పెట్టిన ప్రతిపాదనలు, వాటిపై చేయాల్సిన ఫాలో అప్ వంటి అంశాలు చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, నామినేటెడ్ పదవులపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications